ఆదుకోండయ్యా !

Jan 9,2025 03:39 #Drought team, #Farmers' cry, #Members
  • కరువు బృందం సభ్యులకు రైతుల మొర
  • రాయలసీమలో పర్యటించిన బృందాలు
  • పశుపోషణ శిబిరాల ఏర్పాటు చేయాలని రైతుల వినతి

ప్రజాశక్తి – యాదమరి, అనంతపురం, మదనపల్లె అర్బన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో ఎకరా పొలంలో వేరుశనగ పంట సాగు చేశానని, సకాలంలో వర్షాలు పడకపోవడంతో కేవలం మూడు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చిందని చిత్తూరు జిల్లా కోనాపల్లి గ్రామానికి చెందిన చిట్టిబాబు తన ఆవేదనను కరువు బృందం ఎదుట వెలిబుచ్చారు. ఎకరాకు రూ.25 వేలు ఖర్చు పెట్టానని, పెట్టుబడి కూడా రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. కరువును జయించాలంటే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని కరువు బృందం సభ్యులు సూచించారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. పంట నష్టం, కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర కరువు బృందాలు రాయలసీమ జిల్లాలకు బుధవారం వచ్చాయి. ఒక బృందం ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో, మరో బృందం చిత్తూరు, ఇంకో బృందం అన్నమయ్య జిల్లాలో పర్యటించింది. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కోనాపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలో పంట పొలాలను కరువు బృందం సభ్యులు పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో 16 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారని, అందులో మూడు మండలాలు మధ్యస్థ కరువు మండలాలుగా ఉన్నాయని, మిగిలిన మండలాల్లో తీవ్ర కరువు దృష్ట్యా రైతుల సంక్షేమం కోసం నష్టం అంచనా వేసేందుకు వచ్చామని బృందం సభ్యులు చెప్పారు. కేంద్ర బృందం కమిటీ సభ్యులు జిల్లా అధికారులతో కలిసి కోనాపల్లి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. వేరుశనగ విత్తనాలు వంద శాతం సబ్సిడీతో అందించాలని, రైతులు కరువు మండలంగా ప్రకటించడంతో పాటు పాడి పశువులకు పశుపోషణా శిబిరాలు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో వేరుశనగ పంట సాధారణ విస్తీర్ణం 1,07,935 ఎకరాలు కాగా, 138,865 ఎకరాల్లో సాగు చేశారని తెలిపారు. కేంద్ర కరువు నిర్ధారణ కమిటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దీపాంకర్‌ సెట్‌, లైవ్‌ స్టాక్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మన్నాజీ ఉపాధ్యాయ పాల్గొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండల కేంద్రంలో కేంద్ర బృందం పర్యటించింది. అనంతరం అనంతపురం జిల్లా అనంతపురం రూరల్‌ మండలం మన్నీల గ్రామం, రాప్తాడు పంచాయతీలోని పంట పొలాలను పరిశీలించింది. పంట సాగు, దిగుబడి, నష్టం తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా కరువు బృందం సభ్యులకు స్థానిక రైతులు పలు వినతులను అందజేశారు. అనంతపురం జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కేంద్ర కరువు బృందం సభ్యులుగా జయంతి కనోజియా, కె.పొన్నుస్వామి ఉన్నారు. అన్నమయ్య జిల్లాలో బి.కొత్తకోట, వాల్మీకిపురం, మదనపల్లె, తంబళ్లపల్లె తదితర మండలాల్లో కరువు బృందం పర్యటించింది. సుప్రియ మాలిక్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు పర్యటించారు. పంట నష్టం వివరాలను స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. కరువు తీవ్రతను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ వివరించారు.

➡️