సిఐటియు జాతీయ కోశాధికారి సాయిబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు పాల్గని జయప్రదం చేయాలని సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు పిలుపునిచ్చారు. ఎపి ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలోని ఎంబివికెలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రైవేటు సెక్యూరిటీ వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఎటువంటి భారం లేకపోయినప్పటికీ ప్రైవేటు సెక్యూరీటీ గార్డుల వేతనాల సవరణకు చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అవలంభించడమేనన్నారు. ప్రైవేటు సెక్యూరీటీ గార్డ్స్ వేతనాల సవరణ గత దశాబ్ధకాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదన్నారు. దీనివల్ల ప్రైవేటు ఏజెన్సీలు లబ్ధిపొందుతుంటే, ఈ రంగంలో పనిచేసే లక్షలాది మంది సెక్యూరిటీ గార్డుల కుటుంబాలు చాలీచాలని వేతనాలతో అలమటిస్తున్నాయని తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, గతంలోని చట్టాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల పరిశ్రమలు, సంస్థల్లో యూనియన్ ఏర్పాటు, సమస్యలపై సెమ్మెకు నోటీసు ఇవ్వడం కూడా నేరమే అవుతుందని తెలిపారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే 20వ తేదీ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సిఐటియు పోరాటాలతో యాజమాన్యం వ్యతిరేకించినా శామ్‌సంగ్ కంపెనీలో యూనియన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో పారిశ్రామికవేత్తలకు లాభాలు రావడం లేదని, దీంతో కార్మికుల పొట్టగొట్టి యాజమాన్యాలకు మేలు చేసేందుకే ప్రభుత్వాలు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నాయని చెప్పారు.
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెక్యూరిటీ గార్డులుగా 50 లక్షల మంది పని చేస్తున్నారని, అయితే, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరించలేదన్నారు. వేతనాల కోడ్ పేరుతో కార్మికుల వేతనాలపై దాడి జరుగుతోందన్నారు. సార్వత్రిక సమ్మెకు సన్నద్ధంగా యూనియన్ నాయకులు ఈ నెల 10వ తేదీలోపు సదస్సులు, 17, 18వ తేదీల్లో మోటార్ సైకిల్ జాతాలు, కార్మికుల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. 20న సమ్మెలో భాగంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. యూనియరు ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు బుజ్జిబాబు అధ్యక్షత వహించారు.
