– ఎకరాకు రూ. మూడు లక్షల నష్టపరిహారమివ్వాలి
– యాష్‌పాండ్‌తో దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన ఎపి రైతు సంఘం నాయకులు
ప్రజాశక్తి-నెల్లూరు :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎపి జెన్‌కో పరిశ్రమ)కు చెందిన యాష్‌పాండ్‌కు గండిపడి దెబ్బతిన్న పంట పొలాలకు చెందిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆయా కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. దెబ్బతిన్న పంట పొలాలను మంగళవారం ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతాంగం తమకు జరిగిన అన్యాయాన్ని నాయకుల దృష్టికి తీసుకువచ్చింది. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలివెంగయ్య మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాసిరకమైన కట్టడాలు నిర్మించినందువల్ల జరగరాని నష్టం చోటు చేసుకుందన్నారు. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే అనేక రసాయనాలు, కాలుష్యం కారణంగా చుట్టుపక్కల గ్రామాలన్నీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నష్టపోయిన రైతాంగాన్నికి ఎకరాకు మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యాష్‌తో పూడిక పోయిన కాలువల మరమ్మతులు చేపట్టాలని, యాష్ పాండ్‌కు సమీపంలో ఉన్న దేవర దిబ్బ గిరిజన కాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పులిగండ్ల శ్రీరాములు మాట్లాడుతూ.. ఈ ఘటన చోటు చేసుకొని నాలుగు రోజులు పూర్తి కావస్తున్నా గండిని పూడ్చేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టి కారకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించని పక్షంలో ప్రజలందరినీ సమీకరించి జెన్‌కో గేటు ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఓడూరి వెంకట కృష్ణయ్య, రైతు సంఘం ముత్తుకూరు మండల కార్యదర్శి బ్రహ్మదేవి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
