- 15న చేపడతామని పేర్కొన్న ధర్మాసనం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఫార్ములా ఇ-రేసు అక్రమాలపై ఎసిబి నమోదు చేసిన కేసులో తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కెటిఆర్) దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో కెటిఆర్ న్యాయవాది గురువారం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ కేసు విచారణను ఈనెల 15న చేపడతామని పేర్కొంది. ఈ నెల 7న తెలంగాణ హైకోర్టు తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అదే రోజు కెటిఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాది మోహిత్ రావు సుప్రీంకోర్టులో మొత్తం 430 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. తమ క్వాష్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో ఊరట దక్కలేదని, అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తన పిటిషన్‌పై హైకోర్టులో ప్రొసిడింగ్స్‌ను రద్దు చేయమని కోరితే అందుకు న్యాయస్థానం అంగీకరించలేదని తెలిపారు. అందువల్ల హైకోర్టు తీర్పును రద్దు చేసేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కాగా ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బుధవారం కెటిఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు రిజిస్టార్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని ప్రొసిడింగ్స్ ప్రకారం రిజిస్టార్ సీజేఐకు నివేదించగా.. ఈ అభ్యర్థన ఆధారంగా సిజెఐ ఈ కేసు విచారణను ఈ నెల 15వ తేదిని కేటాయిస్తూ జాబితాలో లిస్ట్ చేశారు. అయితే… గురువారం ఈ విషయాన్ని మరోసారి కెటిఆర్ తరపు సీనియర్ న్యాయవాది రాజీవ్ షిడ్ ఖర్, న్యాయవాది మోహిత్ రావులు సిజెఐ బెంచ్ ముందు మెన్షన్ చేసి తక్షణ (శుక్రవారం) విచారణకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై స్పందించిన సిజెఐ… అత్యవసర విచారణకు నిరాకరించారు. ఇప్పటికే కేసు విచారణకు 15వ తేదీని కేటాయించామని తెలిపారు. ఇదే సందర్భంలో తెలంగాణ తరపు స్టాండింగ్ కౌన్సిల్ సైతం పిటిషనర్ విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సిజెఐ… 15వ తేదినే విచారణ చేపడతామని పేర్కొన్నారు.