తప్పుడు ప్రకటనలకు అవకాశం కల్పించే ఆయుష్‌ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ : ఆయుర్వేద, సిద్ధ, యునాని ఔషధాలకు సంబంధించి తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలకు పచ్చజెండా ఊపుతూ ఇటీవల ఆయుష్‌ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలతో చలగాటమాడేందుకు వీలుకల్పిస్తారా అంటూ మొట్టికాయలు వేసింది. డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ రూల్స్‌, 1945లోని 170వ రూల్‌ ప్రకారం ప్రజలను తప్పుదారి పట్టించేలా ఆయుర్వేద, సిద్ధ, యునాని ఔషదాలు, సౌందర్య ఉత్పత్తుల ప్రచారాలపై నిషేదం విధించారు. ఈ రూల్‌ను ఎత్తివేసి తప్పుడు ప్రకటనలకు మార్గం సుగమం చేసేలా ఇటీవల ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన ‘పతంజలి’ వంటి సంస్థల తప్పుడు ప్రచారాలపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో న్యాయపర చిక్కులు రాకుండా ‘పతంజలి’ వంటి సంస్థల తప్పుడు ప్రకటనలకు మార్గం సుగమం చేసేలా ఆయుష్‌ రూల్‌ 170ను తొలగిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయుష్‌ జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సమాచారం మే 7, 2024 నాటి ఉత్తర్వుల్లో వున్నాయని జస్టిస్‌ హిమా కొహ్లి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన బెంచ్‌ తెలిపింది. తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలపై సుప్రీం కోర్టు ఈ ఏడాది మే 24 నిషేధం విధిస్తూ, ఒక వాణిజ్య ప్రకటనను జారీ చేసేందుకు అనుమతించడానికి ముందుగా కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ రూల్స్‌, 1994 ప్రకారం అడ్వర్టయిజర్ల నుండి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఆగస్టు 29, 2023 నాటి లేఖను ఉపసంహరించుకోవడానికి బదులుగా జులై 1వ తేదీన 170వ నెంబరు రూల్‌ను తొలగిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారని, అది, ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా వుందని బెంచ్‌ పేర్కొంది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ నోటిఫికేషన్‌ అమలుపై స్టే విధించామని బెంచ్‌ తెలిపింది. కాగా కేంద్రం వైఖరిని వివరిస్తూ త్వరలో అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నట్లు కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ తెలిపారు.

➡️