17 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి జిల్లా) : నిషేధిత సిపిఐ మావోయిస్ట్‌ పార్టీ పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మిలీషియా సభ్యులు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ అమిత్‌ బర్ధర్‌, అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ దిరజ్‌ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ.. వీరు గిన్నెలకోట, లండులు, ఇంజరి ప్రాంతాల్లో అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు చేపట్టిన స్ఫూర్తి, ప్రేరణ, నిర్మాణ్‌ వంటి కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుండడం, పోలీసులు ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ క్యాంపుల పట్ల ఆకర్షితులై స్వచ్ఛందంగా లొంగిపోయారని వివరించారు. ముఖ్యంగా ఇటీవల లొంగిపోయిన 23 మంది సిపిఐ మావోయిస్ట్‌ పార్టీ సభ్యులకు రూ.23 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, వారికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున చెక్కులను అందించడం కూడా ఈ మిలీషియా సభ్యులను లొంగిపోవడానికి ప్రేరేపించిందని తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పరంగా రావలసిన అన్ని రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్‌పి తెలిపారు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలి అనుకొనేవారు స్వచ్ఛందంగా గానీ, బంధుమిత్రుల ద్వారాగానీ, తమ దగ్గరలోని పోలీసు స్టేషన్‌లోగానీ, లేదా జిల్లా పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు.

➡️