ప్రజాశక్తి -తిరుపతి సిటీ : తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన నకిలీ ఓట్ల వ్యవహారంపై నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డిఐజి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిఐలు అబ్బన్న, దేవేంద్ర కుమార్, ఎస్‌ఐలు సుమతి, నాగేంద్రబాబులను సస్పెండ్ చేశారు. తిరుపతి మాజీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతి కారణంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల సందర్భంగా నకిలీ ఓట్లు నమోదయ్యాయని ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి అప్పటి తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ ఐఎఎస్ అధికారి గిరీష లాగిన్ నుంచి నకిలీ ఓట్లు నమోదు కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. నకిలీ ఓట్ల కేసు నమోదులో అలసత్వం వహించారని భావించిన ఉన్నతాధికారులు ఇప్పటికే నలుగురు సిఐలను, ఎస్‌ఐలను సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఇద్దరు సిఐలు, ఎస్‌ఐలను సస్పెండ్ చేశారు.
