సస్పెన్షన్లు…బదిలీలు

  • అధికారులపై చర్యలు
  • వెల్లడించిన సిఎం

ప్రజాశక్తి – తిరుపతి : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాటకు బాధ్యులైన పలువురు అధికారులపై చర్యలు తీసుకుం టున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. ‘డిఎస్‌పి రమణకుమార్‌ బాధ్యత లేకుండా పనిచేశారు.’ అని ఆయన అన్నారు. రమణకుమార్‌తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డిలను సస్పెండ్‌ చేస్తున్నట్లు సిఎం చెప్పారు. సమన్వయ లోపంతో పనిచేసిన తిరుపతి ఎస్‌పి సుబ్బరాయుడు, టిటిడి సివిఎస్‌ఒ శ్రీధర్‌, జెఇఒ గౌతమిలను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన అన్నారు. అంతకుముందు నిర్వహించిన సమీక్షలో తొక్కిసలాట సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త స్థలాల్లో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కనీస ముందుజాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. వేలాదిమంది యాత్రికులు ఒక చోట చేరుతున్నప్పుడు ఎలా వ్యవహరించాలో సిబ్బందికి చెప్పారా? అని ఆయన అధికారులను అడిగారు. ‘నేరుగా చెప్పకపోతే కనీసం వాట్స్‌అప్‌ గ్రూపులోనైనా హెచ్చరికలు చేయవచ్చు కదా? చేస్తే నాకు చూపించండి’ అని ఆయన అన్నారు.

➡️