ప్రజాశక్తి-రాయదుర్గం (అనంతపురం) : అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక సంఘంలోని పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గం మున్సిపల్ పారిశుధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిన కొల్లారి (43) గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఆయన గత ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు గాలించినప్పటికీ ఎక్కడా కనిపించకపోవడంతో సోమవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణ పొలిమేర గౌడ లేఅవుట్ జగనన్న కాలనీలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇంట్లో కొల్లారి మృతదేహం కనిపించింది. అక్కడికి కొంతదూరంలో ఆయన ద్విచక్ర వాహనం ఉంది. కుటుంబ సభ్యులు కొల్లారి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేపట్టారు.కొల్లారి మున్సిపల్ పారిశుధ్య కార్మికునిగా విధులు నిర్వహించడంతో పాటు లఘుచిత్రాలు నిర్మించేవారు. కొల్లారి సినీ క్రియేషన్స్ పేరుతో శివతో జాహ్నవి, నాగలి, వాట్ ఎవర్, బాతాకాని బార్సు, చిట్టి, చెల్లి వినవే మొదలైన లఘుచిత్రాలు తీశారు. మృతుని భార్య ఆరేళ్ల క్రితం మరణించారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది.