- జాతీయస్థాయి వర్క్‌షాపులో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యదర్శి లీనా నందన్
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్టణం) : వస్తువుల పునర్వినియోగం, వ్యర్థాల నిర్వహణతో సుస్థిర అభివృద్ధి సాధ్యమమవుతుందని, సరికొత్త ఆర్థిక ఫలాలు చేకూరుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యదర్శి లీనా నందన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని కోరారు. 4వ చీఫ్ సెక్రటరీస్ జాతీయ కాన్ఫరెన్స్‌లో భాగంగా గురువారం విశాఖలోని నోవొటెల్ హోటల్లో నిర్వహించిన ‘సర్క్యులర్ ఎకానమీ – పాలసీ టు ఇంప్లిమెంటేషన్’ జాతీయ వర్క్ షాపునకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యకలాపాలపై, తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆచరణాత్మకమైన ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ఉత్పత్తుల వినియోగం, రీసైక్లింగ్, రీయూజ్ అనే కాన్సెప్ట్‌లపై అందరూ ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యర్థాల నిర్వహణపై యువతకు శిక్షణ ఇప్పించాలని, సర్టిఫికేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేస్తూ వస్తువుల పునర్వినియోగం, వ్యర్థాల నిర్వహణ కొనసాగించాలని, ఎక్కడికక్కడ రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అడాప్ట్ చేసుకోవాలని అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అదనపు కార్యదర్శి నరేష్ పాల్ గాంగ్వార్ మాట్లాడుతూ ప్రస్తుత విధానాల్లో ఉన్న అంతరాలను గుర్తించి సరిచేయాలని, ఉత్తమ విధానాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ) అనంత రాము మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సన్ రైజ్ సెక్టార్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఆశించిన ఫలితాలు సాధించాలని అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ టాప్ స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. జివిఎంసి కమిషనర్ పి.సంపత్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో వ్యర్థాల నిర్వహణ, వస్తువుల పునర్వినియోగంలో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ ఉత్తమ ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఔత్సాహికులకు చేయూత, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, డెమోగ్రాఫిక్ డివిడెండ్, వ్యర్థాల నిర్వహణ, వస్తువుల రీసైక్లింగ్, పునర్వినియోగం తదితర అంశాలపై ఈ వర్క్‌షాపులో సుదీర్ఘంగా చర్చించారు. దేశంలోని అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు వ్యర్థాల నిర్వహణకు అవలంభిస్తున్న విధానాలకు సంబంధించి 51 అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. బ్యాటరీ, వాహన, తుక్కు, మైనింగ్, ప్లాస్టిక్, పాత టైర్లు, ఎలక్ట్రానిక్ వేస్టు, వినియోగించిన ఆయిల్, సోలార్ వేస్టు, లిక్విడ్ వేస్టు, నిర్మాణాల కూల్చివేత తదితర ప్రక్రియల్లో వచ్చే వ్యర్థాల నిర్వహణపై సమగ్ర వివరాలను అందించారు.
ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, సాధిస్తున్న ఫలితాలను వివరించారు. సదస్సులో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.