ఎపి హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం
ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : ఈ నెల 14వ తేదీ నుండి స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోషియేషన్ అధ్యక్షులు ఆర్‌వి స్వామి తెలిపారు. ‘హోటల్ పరిశ్రమను రక్షించుకుందాం, స్విగ్గీని బహిష్కరిద్దాం’ అనే నినాదంతో ఉన్న పోస్టర్‌ను విజయవాడలోని హోటల్ అసోషియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో స్వామి మాట్లాడుతూ హోటళ్ల నుండి ఫుడ్ ఆర్డర్ చేసి నగదు చెల్లించకుండా ఇబ్బందిపెడుతున్న స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవలే తమ అసోషియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించి అన్ని జిల్లాలకు తెలియజేసినట్లు వివరించారు. స్విగ్గీ, జమాటో వల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు నష్టం జరుగుతోందన్నారు. దీనిని గమనించి ఇటీవల ఆ రెండు సంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ చర్చల్లో జమాటో మాత్రమే తమ డిమాండ్లను అంగీకరించిందని తెలిపారు. స్విగ్గీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ హోటళ్లు, రెస్టారెంట్లకు నష్టం కలిగించే దిశగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14 నుండి స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్విగ్గీ సాధ్యంకాని ఆఫర్లు ఇస్తోందని, ఒకటి కొంటే ఒక బిర్యానీ ఉచితమని, రూ.49, రూ.99, రూ.129లకే బిర్యానీ అంటూ ఆఫర్లు ఇస్తూ వినియోగదారులను మోసం చేస్తోందన్నారు. దీంతో నాణ్యతతో ఫుడ్ అందించే హోటళ్లు, రెస్టారెంట్లకు అమ్మకాలు లేక నష్టం వాటిల్లుతోందన్నారు. మీడియా సమావేశంలో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, ప్రకాశం, గుంటూరు జిల్లాల హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రమణ, వసంత కృష్ణ, శ్రీనివాసరావు, అంజి, కొండయ్య నాయుడు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గన్నారు.
