- అనంత ఎస్‌పిని కోరిన తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.అస్మిత్‌రెడ్డి
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సాగతున్న అక్రమ ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.అస్మిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం అనంతపురం ఎస్‌పి జగదీశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇదే అంశంపై జోరు వానలోనూ తాడిపత్రిలో పోలీసు స్టేషన్ ఎదుట అస్మిత్‌రెడ్డి మంగవారం ధర్నా నిర్వహించారు. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో కొంత మంది అక్రమ ఇసుక దందా సాగిస్తున్నారని సమాచారం ఇచ్చినా సిఐ చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఇసుక అక్రమ వ్యాపారంపై ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి తాము పోరాటం సాగిస్తున్నామని గుర్తు చేశారు. గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకునే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఎస్‌పికి వినతి పత్రం అందజేసిన తరువాత జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్‌నూ మర్యాద పూర్వకంగా కలిశారు.