విఒఎలకు గుదిబండలా కాలపరిమితి సర్క్యులర్‌

Mar 12,2025 00:15 #mlc iv, #Vijayawada, #voa dharna
  •  ఉపసంహరించుకోవాలంటూ ధర్నా

ప్రజాశక్తి-విజయవాడ : విఒఎలకు గుదిబండగా తయారైన మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్‌పై శాసన మండలిలో మాట్లాతానని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎపి వెలుగు విఒఎ ఉద్యోగుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో విఒఎలు మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. విఒఎ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.రూపాదేవి అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మద్దతు తెలిపి మాట్లాడారు. విఒఎలకు టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విఒఎలకు కాలపరిమితి సర్క్యులర్‌ ఉద్యోగుల మెడపై కత్తిలాగా ఉందని, వెంటనే దాన్ని రద్దు చేయాలని కోరారు. అన్యాయంగా తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, మహిళా మార్టుల్లో బలవంతపు కొనుగోళ్లు ఆపాలని డిమాండ్‌ చేశారు. విఒఎల సమస్యలపై సంబంధిత మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు అయ్యేంత వరకు విఒఎలకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు అండగా ఉంటారని తెలిపారు. విఒఎ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా విఒఎలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదని, దీనివల్ల పెరిగిన ధరలతో విఒఎల కుటుంబాలు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని, పని భారం తగ్గించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు. కాలపరిమితి సర్య్కులర్‌ రద్దు అయ్యేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడు తూ.. విఒఎల ఉపాధికి, ఉద్యోగ భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను సవరిస్తూ ఉద్యోగ, కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు రూ.178 చొప్పున నెలకు రూ.4,800 వేతనాలతో కార్మికులు ఎలా బతకాలో మోడీ, చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయా రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు అభివృద్ధి గురించి మాట్లాడటం శోచనీయమని అన్నారు. సిఐట ియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లా డుతూ.. తొమ్మిది మాసాల వ్యవధిలో విఒఎలతోపాటు ఆయా రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికులకు వేతనాలు ఇవ్వాలంటే ఖజానా ఖాళీ అయిందని చెప్తున్న ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపే పనిలో నిమగమైందని విమర్శిం చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి తిరుపతయ్య, రాష్ట్ర నాయకులు నిర్మలమ్మ, శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర నాయకులు ఎ కమల పాల్గొన్నారు.

➡️