కాలపరిమితి సర్క్యులర్‌ రద్దుపై త్వరలో మంత్రితో చర్చలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విఓఎల ఉపాధికి ఎసరు తెస్తున్న కాలపరిమితి సర్క్యులర్‌ రద్దుపై త్వరలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సమక్షంలో చర్చలు జరిగే విధంగా కృషిచేస్తామని సెర్ప్‌ సిఇఓ వీరపాండియన్‌ తమకు హామీ నిచ్చినట్లు ఎపి వెలుగు విఓఎ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం (సిఐటియు) పేర్కొంది. సోమవారం సాయంత్రం సిఇఓ తమతో విఓఎల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ రూ.10 లక్షలు అమలు విషయం పరిశీలించి న్యాయం చేస్తామని, కోర్టు ఉత్తర్వులు అమలు జరిగేట్లు చర్యలు తీసుకుంటామని సిఇఓ హామీ ఇచ్చినట్లు వెలుగు విఓఎ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి పేర్కొన్నారు. అంతకు ముందు విజయవాడ ధర్నా చౌక్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రూపాదేవి అధ్యక్షతన సభజరిగింది. సభలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ రోజు రోజుకీ విఓఎల పైన పనిభారం పెంచుతూ మానసిక వేదనకు గురి చేస్తున్న ప్రభుత్వ విధానాలను వెంటనే మార్చాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రోజుకో రకమైన యాప్‌తో విఓఎల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగించడం పరిపాటిగా మారిందన్నారు. అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వర రావు, ఆర్‌వి నరసింహారావు మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి 7నెలలు గడుస్తున్నా ఉద్యోగులు, కార్మికులు సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం కృషి చేయడం లేదని విమర్శించారు. విఓఎల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటానికి సిఐటియు, అనుబంధ సంఘాల తరపున మద్దతు ప్రకటించారు. విఓఎల సంఘ నాయకులు ఎ.తిరుపతయ్య, నిర్మలమ్మ, సోమన్న, గుంటప్ప, అసిరి నాయుడు, ఆర్‌ భాను, ఎ.కమల, కృష్ణమ్మ, రాజశేఖర్‌, సుభాషిణి, గంగా భవాని, పి.వెంకటలక్ష్మి, స్వరూప ధర్నారావు ప్రసంగించారు.

➡️