- వర్సిటీలోకి ప్రవేశించిన టిడిపి శ్రేణులు
- ప్రధాన భవనం పైకెక్కి బోర్డు ధ్వంసం
- వైఎస్‌ఆర్ పేరు స్థానంలో ఎన్‌టిఆర్‌గా మార్పు
- భయాందోళనకు గురైన సిబ్బంది
ప్రజాశక్తి- విజయవాడ అర్బన్ : విజయవాడలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద మంగళవారం తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. కొందరు టిడిపి కార్యకర్తలు వర్సిటీలోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించారు. భవనంపైకెక్కి డాక్టర్ వైఎస్‌ఆర్ అని ఉన్న బోర్డును ధ్వంసం చేశారు. దాని స్థానంలో ఎన్‌టిఆర్ అని మార్పు చేశారు. రాష్ట్రంలో టిడిపి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒక్కసారిగా వర్సిటీలోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగారు. వర్సిటీ గేటు బయట ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డు చెప్పినా వినకుండా జై ఎన్‌టిఆర్ అంటూ నినాదాలు చేసూకుంటూ లోపలికి ప్రవేశించారు. దీంతో, ఉద్యోగులు, ఇతర సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రధాన భవనం పైకెక్కి వర్సిటీ నేమ్ బోర్డును ధ్వంసం చేశారు. బోర్డులో వైఎస్‌ఆర్ అని ఉన్న అక్షరాలను పగులగొట్టి వాటి స్థానంలో ఎన్‌టిఆర్ అనే అక్షరాలను ఏర్పాటు చేశారు. వర్సిటీ ఆవరణలోని డాక్టర్ వైఎస్‌ఆర్ విగ్రహం శిలాఫలకాన్ని ధ్వంసం చేసి కాళ్లతో తొక్కారు. ఆ విగ్రహానికి టిడిపి జెండాను కట్టే ప్రయత్నం చేశారు. వర్సిటీ బయట ప్రధాన ద్వారం వద్ద ఉన్న బోర్డునూ పగులగొట్టారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు వెళ్లిపోయారు. 1983లో నగరంలో తొలి ఆరోగ్య విశ్వవిద్యాలయాలన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ ప్రారంభించారు. అప్పటి నుండి డాక్టర్ ఎన్‌టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా కొనసాగింది. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పేరును డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్మాయలయంగా మారుస్తూ జిఒ జారీ చేసింది. దీంతో, అప్పట్లో టిడిపి కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున నిరసనకు దిగిన విషయం తెలిసిందే.