తిరుపతి : తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా టిడిపి అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. 26 మంది మద్దతుతో ఆయన ఎంపికయ్యారు. వైసిపి అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతు లభించింది. దీంతో టిడిపి అభ్యర్థి మునికృష్ణను తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికల అధికారి ప్రకటించారు. సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. కోరం లేకపోవడంతో ఈరోజుకు వాయిదా పడింది. తిరుపతి నగరపాలక సంస్థలో 50 మంది కార్పొరేటర్లకుగాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి వైసిపి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. మొత్తంగా 50 మంది సభ్యులకుగాను సగం మంది (25) హాజరు కావాల్సి ఉండగా, ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే రావడంతో కోరం లేదని సోమవారం అనివార్యంగా ఎన్నికను వాయిదా వేశారు. దీంతో నేడు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది.
