చివరి రోజు నలుగురు

  • ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసన సభ్యుల కోటాలో ఎంఎల్‌సి ఎన్నికల నామినేషన్లకు చివరి రోజైన సోమవారం నాడు టిడిపి కూటమి తరపునుండి నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. టిడిపి నుంచి బీద రవిచంద్ర, బి.టి నాయుడు, కావలి గ్రీష్మ, బిజెపి నుంచి సోము వీర్రాజులు తమ నామినేషన్లు సోమవారం దాఖలు చేశారు. జనసేన అభ్యర్ధిగా కె.నాగబాబు గత శుక్రవారమే నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. తొలుత టిడిపి అభ్యర్ధులు, అనంతరం బిజెపి అభ్యరి తమ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆర్‌.వనితారాణికి అందచేశారు. మొత్తం ఏడు నామినేషన్లు దాఖలు చేశారు. టిడిపి అభ్యర్ధులతో పాటు నామినేషన్‌ దాఖలు చేయడానికి మంత్రులు నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విష్ణుకుమార్‌ రాజు, పల్లా శ్రీనివాసరావు, కె.లలితకుమారి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాసన మండలి చీఫ్‌ విప్‌ అనురాధలు హాజరయ్యారు. బిజెపి అభ్యర్ధితో వెంట మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌ రాజు, పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్కో స్థానానికి ఒక్కోక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో కూటమి అభ్యర్ధుల ఎన్నిక లాంఛన ప్రాయమే. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్ధులు బి.టి నాయుడు, బీద రవిచంద్ర, సోము వీర్రాజులు సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

➡️