ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మెజార్టీ లేకున్నా తెలుగుదేశం పార్టీ అనైతికంగా పోటీ చేస్తోందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం ఆయన నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబునాయుడి కుట్రలను, కుతంత్రాలను అధిగమించి వైసిపి అభ్యర్థి బత్స సత్యనారాయణను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా వుండాలన్నారు. కాని చంద్రబాబునాయుడు అలాంటి సాంప్రదాయాలను గాలికి వదిలి అక్రమాలతోనైనా విశాఖపట్నంలో గెలవాలని చూస్తున్నారని అన్నారు. చేసిన వాగ్దానాలపై 2014లో మాట తప్పినట్లే ఇప్పుడు కూడా మాటతప్పుతున్నారని అన్నారు. ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. కష్టకాలంలో మనం ఎలా ఉంటున్నామనేది ప్రజలు చూస్తారని ఎవరూ అధైర్య పడవద్దని చెప్పారు. చీకటి తర్వాత వెలుగు రాక మానదని భవిష్యత్ వైసిపిదేనని అన్నారు. విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్యాయంగా వ్యవహరించారని అన్నారు. ధనబలం, అధికార బలంతో గెలవాలనుకున్న చంద్రబాబుకు తగిన విధంగా బుద్దిచెప్పే అవకాశం మీకు వచ్చిందన్నారు.
