తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్న టిడిపి – జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ఎపి ఎస్‌ఆర్‌టిసి ఒక్క బస్సును కూడా కేటాయించలేదు. తొలిసారిగా ఎన్నికల ప్రచార సభలో ఉమ్మడిగా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ‘జెండా’ పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు జనాలను తీసుకెళ్లేందుకు 100 బస్సులు కావాలంటూ … రెండు పార్టీల నేతలు ఆర్‌టిసికి విజ్ఞప్తి చేశారు. సభ కోసం 100 బస్సులు కావాలంటూ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, 50 బస్సులు కావాలంటూ ఉండి ఎమ్మెల్యే రామరాజు ఆర్‌టిసికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ దరఖాస్తులను అధికారులు తోసిపుచ్చారు. దీంతో ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కేటాయించలేదని నేతలు మండిపడ్డారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు సొంత వాహనాల్లోనే సభకు బయలుదేరారు. అయితే, సభకు సెక్యూరిటీ కూడా తగినంత కల్పించలేదని ఇరు పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
