- కలెక్టర్‌తో మాట్లాడించాలని స్థానికుల డిమాండ్
ప్రజాశక్తి- దేవనకొండ : కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు జరగడం లేదని ప్రజలు మభ్యపెట్టడానికి టిడిపి నాయకులు ప్రయత్నించారు. ఎవరికైనా సందేహాలుంటే ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్దకు తీసుకెళ్లి వారితో మాట్లాడిస్తామని టిడిపి జిల్లా అధ్యక్షులు పి. తిక్కారెడ్డి,పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు కెఇ.శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, టిడిపి ఆలూరు, కోడుమూరు ఇన్‌ఛార్జీలు వీరభద్రగౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన ఆలూరు ఇన్‌ఛార్జీ తెర్నేకల్లు వెంకప్ప నమ్మబలికారు. అయితే దీనిపై కోటకండ, కప్పట్రాళ్ల గ్రామ ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. యురేనియం తవ్వకాలపై జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తవ్వకాలు జరుపుతారనే భయం తమకుందని, తవ్వకాలు నిలిపివేస్తున్నట్లు స్పష్టత ఇవ్వాలని కోరారు. లేదంటే ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కలెక్టర్‌తోనే హామీ ఇప్పిస్తామని చెప్పి అక్కడి నుంచి నాయకులు వెనుదిరిగారు.
నేడు ఎంఏ.గఫూర్, కె.రామకృష్ణ పర్యటన
దేవనకొండ మండలం కప్పట్రాళ్ల రిజర్వు పారెస్టు ఏరియాలో యురేనియం నిక్షేపాల అన్వేషణ నిర్వహించనున్న ప్రదేశాన్ని సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం పర్యటించనున్నారు.