ఐపిఎస్‌లు సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు పైనా..
కస్టడీలో చంపబోయారని మాజీ ఎంపి రఘురామ ఫిర్యాదు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మాజీ సిఎం వైఎస్ జగన్‌తో పాటు సిఐడి మాజీ డిజిపి వి.సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ అదనపు డిజిపి సీతారామాంజనేయులు, అప్పటి సిఐడి అదనపు ఎస్‌పి విజరుపాల్, గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై గుంటూరు నగరంపాలెం పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు శుక్రవారం వెలుగుచూశాయి. 2021 మే 14న విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు తనపై హత్యాయత్నం చేశారని, తీవ్రంగా కొట్టారని పేర్కొంటూ మాజీ ఎంపి, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. తనను కస్టడీలోకి తీసుకున్న సిఐడి అధికారులు రబ్బర్ బెల్టు, లాఠీలతో కొట్టారని, కానీ కోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని, తనను తీవ్రంగా వేధించి, భయపెట్టారని, తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటనపై గురువారం సాయంత్రం గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఆయన ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. బైపాస్ సర్జరీ జరిగినట్టు చెప్పినా ఛాతిపై కూర్చుని తనను చంపడానికి ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని ఇష్టమొచ్చినట్టు కొట్టారని ఆరోపించారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా పోలీసుల ఒత్తిడి మేరకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు. జగన్‌ను విమర్శిస్తే చంపుతామని సునీల్‌కుమార్ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు వైఎస్ జగన్, సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు, విజరుపాల్, డాక్టరు ప్రభావతిపై సెక్షన్ 120బి, 166, 167, 197, 307,326, 465, 508(34) ప్రకారం కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్‌పి తుషార్ దూడి పర్యవేక్షణలో డిఎస్‌పి కె.వి.మహేష్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మధుసూధనరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జగన్‌పై ద్వేషంతోనే తప్పుడు కేసు : పొన్నవోలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ద్వేషంతోనే తప్పుడు కేసును బనాయించారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రఘురామ కృష్ణరాజు అరెస్టు అంతా చట్ట ప్రకారమే జరిగిందన్నారు.