నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట : టిడిపి ఎమ్మెల్సీ అనురాధ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికారుల నిర్లక్ష్యంతో తిరుపతిలో సంఘటన జరగడం పట్ల టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రధాన మంత్రి శంకుస్థాపన సమయంలోనే ఈ సంఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఘటనకు బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసి ముగ్గురు అధికారులపై బదిలీ వేటువేసిందని చెప్పారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్రకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరామర్శ నెపంతో జగన్‌, ఆయన అనుచరులు, మాజీ మంత్రి రోజా.. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వెళ్లారా? అని ప్రశ్నించారు.

అర్జీలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్‌, కొనకళ్ల

టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌, ఎపిఎస్‌ఆర్‌టిసి ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణ.. అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఉద్యోగాలు కల్పించాలని పలువురు, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని కొందరు, భూ సమస్యలు పరిష్కరించాలని మరికొందరు అర్జీలు ఇచ్చారు. కడప జిల్లా డిఇఒ మీనాక్షి అసంబద్ధ, అనుచిత వైఖరితో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సభ్యులు ఫిర్యాదు చేశారు.

➡️