టిడిపిలోకి ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి

లోకేష్‌ సమక్షంలో చేరిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి సోమవారం టిడిపిలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆమెకు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉండవల్లిలోని లోకేష్‌ నివాసంలో సోమవారం చేరికల కార్యక్రమం జరిగింది. ఆమెతోపాటు 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపిటిసిలు తదితరులు పార్టీలో చేరారు. స్థానిక సంస్థలను జగన్‌ నిర్వీర్యం చేశారని లోకేష్‌ ఈ సందర్భంగా విమర్శించారు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచ్‌, ఎంపిపి, ఎంపిటిసి, జడ్‌పిటిసిలకు తగిన గౌరవంతోపాటు వేతనం కూడా పెంచుతామని చెప్పారు. సుధారాణి మాట్లాడుతూ.. ఎస్‌కోట నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కబ్జాల కోటగా మార్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోళ్ల లలితకుమారి, రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️