ఆర్‌ఎస్‌ఎస్‌కు తలొగ్గుతున్న టిడిపి?

May 2,2025 00:39 #TDP activists, #TDP alliance

మహిళా నేత సస్పెన్షన్‌ వెనుక ..!
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడికి టిడిపి తలొగ్గుతోందా? ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలే ఈ ప్రశ్నకు కారణం. ఒక మహిళా నేతను టిడిపి నుండి సస్పెండ్‌ చేయడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడి ఉందన్న చర్చ ఆ పార్టీశ్రేణుల్లోనే సాగుతోంది. టిడిపి మహిళ స్టేట్‌ మీడియా కోఆర్డినేటర్‌గా ఉన్న సందిరెడ్డి గాయత్రి పెహల్గాం ఉగ్రదాడిపై జరిగిన ఒక చర్చాగోష్టిలో ఇటీవల పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆమె ‘ భారతదేశం రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తోందని, రామాయణం, మహాభారతం వంటి మత గ్రంథాలను అనుసరించి కాదు’ అని చెప్పారు. ఈ వీడియోను ఆమె సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో సైతం పోస్టు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు సంఫ్‌ుపరివార్‌శక్తులకు ఆగ్రహం కలిగించాయని చెబుతున్నారు. దీంతో ‘హిందూ ఐటీ సెల్‌ ‘ఆమెపై దాడికి దిగింది. గాయత్రిపై చర్యలు తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఎక్స్‌లోనే హిందూ ఐటీసెల్‌ ఫిర్యాదు చేసింది. అయితే, ఆ ఫిర్యాదుపై టిడిపి నాయకత్వం స్పందించిన తీరుపైనే ప్రస్తుతం కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. సోషల్‌ మీడియాలో గాయత్రిపై వస్తున్న ఆరోపణలు నేపధ్యంలో, పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన ఆమెను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశిస్తున్నట్లు టిడిపి కార్యాలయ కార్యదర్శి పి. అశోక్‌బాబు ఒక నోట్‌ విడుదల చేశారు. కనీసం వివరణ కూడా తీసుకోకుండా ఏకంగా సస్పెండ్‌ చేయడంపై ఆ పార్టీ శ్రేణుల్లోనే చర్చ సాగుతోంది. కొందరు ఎక్స్‌లోనూ పోస్టులు పెడుతున్నారు. గాయత్రి మాట్లాడిన అంశంలో ఎలాంటి తప్పులేదని ఈ పోస్టుల్లో పలువరు అభిప్రాయ పడుతున్నారు. తమ మద్దతు వల్లే కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నడుస్తోందని అయినా బిజెపికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు తలొగ్గాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదుగురు వైసిపి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సంఖ్యాబలం ప్రకారం టిడిపి మూడు, బిజెపి, జనసేనకు తలొక్కటి దక్కాల్సి ఉంది. అయితే వీటిల్లో టిడిపితో సమానంగా బిజెపి వాటా దక్కించుకుంది. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకంగా తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది.

➡️