టిడిపి కార్యకర్తలైన తండ్రీకొడుకులపై వేటకొడవళ్లతో దాడి
ఆస్పత్రికి తరలిస్తుండగా తండ్రి మృతి
ప్రజాశక్తి – పుంగనూరు (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. టిడిపి కార్యకర్తలైన తండ్రీకొడుకులపై వైసిపి కార్యకర్త వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తండ్రి మరణించగా, కుమారుడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ, ఆయన కుమారుడు సురేష్ టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వెంకటరమణ వైసిపిలో కొనసాగుతున్నారు. ఎన్నికల్లో టిడిపి గెలుపు సందర్భంగా గ్రామంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేస్తున్న సందర్భంలో ద్విచక్ర వాహనంపై వెంకటరమణ వచ్చి టిడిపి కార్యకర్తలపైకి వాహనాన్ని ఎక్కించాడు. ఈ ఘటనలో రామకృష్ణ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వారాల క్రితం రామకృష్ణ పెద్ద కుమారుడు శివపై వెంకటరమణ దాడి చేశారు. ఈ క్రమంలో శనివారం రామకృష్ణ కుమారుడు సురేష్‌పై వేటకొడవలితో వెంకటరమణ దాడి చేశారు. పొలంలో పనులు చూసుకుని ఇంటికి వస్తున్న రామకృష్ణకు ఈ విషయం తెలిసింది. నా కుమారుడిపైనే దాడి చేస్తావా? అంటూ వెంకటరమణతో రామకృష్ణ ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో అదే వేటకొడవలితో రామకృష్ణ మెడ, కాళ్లపైనా నరికేశాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణకు ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. సురేష్ చేతికి తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
తమ కుటుంబానికి వైసిపికి చెందిన కె.వెంకటరమణ, గణపతి, మహేష్, త్రిలోక్‌లతో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నా వారిలో స్పందన లేదని రెండు వారాల క్రితం సోషల్ మీడియాతో రామకృష్ణ విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం హాల్‌చల్ చేస్తోంది. పుంగనూరు సిఐ శ్రీనివాసులు వైసిపి వాళ్లకు కొమ్ముగాస్తున్నారని వీడియోలో ఆయన ఆరోపించారు. వీడియో వైరల్ అయిన రెండు వారాల్లోనే రామకృష్ణ హత్యకు గురికావడం చర్చనీయాంశమైంది.