సింగనమల నియోజవర్గంలో పెరిగిన పోలింగ్‌ : టిడిపి-వైసిపి ఆశలు

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సింగనమల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌ లో నియోజకవర్గ వ్యాప్తంగా 86 శాతం పోలింగ్‌ జరగడం తో నియోజకవర్గంలో వైసీపీ తరఫున బరిలో నిలిచిన వీరాంజనేయులు, టిడిపి తరఫున బరిలో నిలిచిన బండారు శ్రావణి లు పోలింగ్‌ శాతం చూసి ఇరు పార్టీల అభ్యర్థులు, నాయకులు ఎవరి సమీకరణరీత్యా వారు విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల నుండి ఒక్కసారిగా ఊపందుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 65 శాతం కూడా ఓటింగ్‌ దాటకపోవచ్చు అని భావించిన పలువురి అంచనాలను తలకిందులు చేస్తూ సింగనమల నియోజకవర్గం లో 86 శాతం పోలింగ్‌ జరగడంతో ఇది ముమ్మాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేనని ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పెద్ద మొత్తంలో ప్రజలు పోలింగ్‌ లో పాల్గని ఓటు హక్కును వినియోగించుకున్నారు అని టిడిపి నాయకులు అంటుండగా… పోలింగ్‌ లో వఅద్ధులు, మహిళలు అధిక శాతం పాల్గన్నారు అని వీరంతా ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన వారు అని తిరిగి వైసిపి నే అధికారంలోకి తీసుకురావాలని వైసిపి కె ఓటు వేసి ఉంటారు అని వైసిపి నాయకులు అంటున్నారు. మొత్తానికి ఓటర్ల అంతరంగం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. సింగనమల్ల నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. నార్పల, (85.77 శాతం) బుక్కరాయసముద్రం, (75 శాతం) గార్లదిన్నె, (73.26 శాతం) సింగనమల, (84 శాతం) ఎల్లనూరు, (75.11) పుట్లూరు (83.40 శాతం) పోలింగ్‌ జరిగింది ప్రధానంగా సింగనమల నియోజకవర్గంలోనే అతిపెద్ద మండలమైన నార్పల పై టిడిపి నాయకులు నమ్మకం పెట్టుకోగా, వైసీపీ నాయకులు ఎల్లనూరు పుట్లూరు మండలాలపై ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ సింగనమల అభ్యర్థిగా వీరాంజనేయులు పేరును ప్రకటించగానే వైసీపీ సీనియర్‌ నాయకుడు నార్పల సత్యనారాయణరెడ్డి ఆయన వర్గీయులు వ్యతిరేకించి అభ్యర్థి మార్పు పై పట్టుపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జిల్లా బస్సు యాత్ర లో సింగనమల నియోజకవర్గ అసమ్మతి నాయకులు అందరితో మాట్లాడడంతో పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, ఆదేశానుసారం అసమ్మతిని వీడి మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని నార్పల మండలంలో సత్యనారాయణ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. అదేవిధంగా పార్టీలో ఎన్ని అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ ఎవరికివారు వైసీపీ అభ్యర్థి విజయం కోసం వైసీపీ నాయకులు ఎవరి స్థాయిలో వారు కృషి చేస్తూ వచ్చారు. అయితే పోలింగ్‌ కు కొన్ని గంటల ముందు శుక్రవారం రోజు మండల కేంద్రమైన నార్పల లో వైసీపీ నాయకులు రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షో కి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నర్సింహయ్య నార్పల మండలంలో అంతర్గతంగా ఉన్న వైసీపీ కలహాలను బహిర్గతం చేసే విధంగా వ్యవహరించి సీనియర్‌ నాయకులు సత్యనారాయణరెడ్డి కి ఆహ్వానం లేకుండా ఒక వర్గంతో కలిసి రోడ్‌ షో కి వెళ్లడంతో వైసీపీ కార్యకర్తలు అందరూ ఆగ్రహించి వెనుతిరిగి వెళ్లారు. దీంతో తిరిగి సాంబశివారెడ్డి, సత్యనారాయణరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి రోడ్‌ షో కి ఆయనను వెంటపెట్టుకొని రావడం కార్యకర్తలు ఆగ్రహించడం నార్పల లో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో సత్యనారాయణ రెడ్డి అనుచరులు తాము ఎంత కలుపుకొని పోవాలని భావించినా రాష్ట్ర నాయకుల ఆదేశాలంటూ స్థానికంగా ఎన్ని అవమానాలు జరిగిన భరించాలంటే తాము భరించలేమంటూ సత్యనారాయణ రెడ్డి అనుచరులు సాంబశివారెడ్డి ఎదుట బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. నార్పల మండల టిడిపి నాయకుల్లో కూడా అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ అవి బహిర్గతం కాకుండా టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసనాయుడు మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరిని కలుపుకొని అందరూ ఏక త్రాటిపై నిలిచే విధంగా తనదైన శైలిలో వ్యవహరించి నార్పల మండలంలో టిడిపికి ఓట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తానికి నార్పల మండలంలో మూడు నుంచి నాలుగు వేల వరకు టిడిపికే మెజార్టీ రావచ్చని చర్చ జరుగుతోంది అదేవిధంగా బుక్కరాయసముద్రం మండలంలో కూడా టిడిపికి ఐదువేలకు పైనే మెజార్టీ రావచ్చునని అదే విధంగా సింగనమల మండలంలో కూడా టిడిపికే రెండు వేల వరకు మెజార్టీ రావచ్చునని గార్లదిన్నె మండలంలో వైసిపి, టిడిపి నాయకులు ఇద్దరు తమకే మెజార్టీ వస్తుందని భావిస్తుండగా ఎల్లనూరు, పుట్లూరు మండలాలలో వైసీపీకి ఏకపక్షంగా ఓటింగ్‌ జరిగిందని ఎవరు ఎన్ని అంచనాలు వేసుకున్న స్వల్ప మెజార్టీతోనైనా వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు విజయం సాధించి తీరుతాడని వైసీపీ నాయకులు అంటున్నారు. వైసీపీ నాయకులు ప్రధానంగా ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లో వైసిపికి భారీ ఎత్తున ఓట్లు పడ్డాయని పోలింగ్‌ మొత్తం వైసీపీకి ఏకపక్షంగా సాగిందని భావిస్తున్నారు. ఎల్లనూరు పుట్లూరు రెండు మండలాలు వైసిపి వారు అనుకున్నంత విధంగా ఏకపక్షంగా ఓటింగ్‌ సాగలేదని టిడిపికి కూడా ఓట్లు బాగానే పడ్డాయని మొత్తానికి తాము సునాయసంగా పది నుండి 15 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తీరుతామంటూ టిడిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలలో భద్రంగా ఉన్న నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఎలా ఉందో తెలుసుకోవాలంటే జూన్‌ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే..! సింగనమల్ల నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధిస్తాడో ఆ పార్టీ అధికారంలోకి వస్తుండడంతో సెంటిమెంట్‌ నియోజకవర్గమైన సింగనమల నియోజకవర్గం ఫలితం ఎలా ఉంటుంది ఓటింగ్‌ ఎలా జరిగింది అంటూ వైసీపీ, టీడీపీ రాష్ట్రస్థాయి నాయకులు సైతం ఆసక్తిగా విచారిస్తుండటం గమనార్హం..!

➡️