నేడు టీచర్‌ ఎంఎల్‌సి ఉప ఎన్నిక

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఉప ఎన్నిక పోలింగ్‌ గురువారం జరగనుంది. మొత్తం 116 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,737 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సిబ్బంది బుధవారం సాయంత్రానికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల వద్ద బుధవారం తొమ్మిది గంటల నుంచి పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరం, ఎటపాక డివిజన్ల పరిధిలో మధ్యాహ్నం రెండు గంటలతోనే పోలింగ్‌ను ముగించనున్నట్లు అథికారులు తెలిపారు. పిడిఎఫ్‌ అభ్యర్థి గోపిమూర్తితోపాటు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల తొమ్మిదిన కౌంటింగ్‌ జరగనుంది. కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను 7వ తేదీలోపు సమర్పించాలని ఎఆర్‌ఒ వెంకటరావు తెలిపారు.

➡️