ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల భర్తీ

  • ఎస్‌సి కమిషన్‌ నివేదికపై చర్చించి నిర్ణయం
  • పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్‌
  • కలిసికట్టుగా ఆంధ్ర మోడల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విధానం
  • విద్యా సంస్కరణలపై మండలిలో నారా లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బుధవారం శాసన మండలిలో ప్రకటించారు. శాసన మండలిలో విద్యాశాఖలో సంస్కరణలపై లఘు చర్చకు మంత్రి నారా లోకేష్‌ సుదీర్ఘ వివరణలో ఈ ఏడాదిలో డిఎస్‌సి నోటిపికేషన్‌పై ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వర్గీకరణపై వన్‌ మ్యాన్‌ కమిషన్‌ నివేదిక వచ్చిందని, ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. నివేదికపై చర్చ అనంతరం కేబినెట్‌ ఆమోదంతో ఎస్సీ కమిషన్‌ కు పంపి, నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు. ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల భర్తీ పూర్తిచేస్తామన్నారు. ఉపాధ్యాయులపై బోధనేతరపనుల వత్తిడి లేకుండా చూస్తామని వీరికి సింగిల్‌ యాప్‌ తీసుకువస్తామన్నారు. టీచర్ల సీనియారిటీ విషయంలో రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సినియారిటీ లిస్ట్‌ ను పారదర్శకంగా రూపొందిస్తున్నామని, ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలన్నారు.

టీచర్‌ ట్రాన్స్‌ ఫర్‌ యాక్ట్‌ ను ఈ సమావేశాల్లోనే తీసుకువస్తామని తెలిపారు. కలిసికట్టుగా ఆంధ్ర మోడల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ను ప్రపంచానికి పరిచయం చేద్దామని వివరించారు. గడచిన ఐదేళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4,271 కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు చెల్లిస్తామన్నారు. కొత్త ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విధానంలో ఏప్రిల్‌ 24 తర్వాత నేరుగా కాలేజీ అకౌంట్‌ లోకి నిధులు జమచేస్తామని, ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించామని కొంతమంది కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల వద్ద బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని అటు వంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం ఎలాంటి సన్నద్ధత లేకుండా వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టారని, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదన్నారు. విద్యార్థులను సన్నద్ధం చేయలేదన్నారు. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారన్నారు. నాడు-నేడు కింద మొదటి విడత పనులు పూర్తిచేసేందుకు రూ.881 కోట్లు అవసరమని నాడు-నేడులో అభివృద్ధి చేసిన పాఠశాలలనే విలీనం పేరుతో మూసివేశారని తెలిపారు. విద్యార్థుల యూనిఫాంలు, కిట్ల పంపిణీలో ఎక్కడా అక్రమాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, వీటిపై రాజకీయనాయకుల ఫోటోలు లేవన్నారు. ఈ ఏడాది ఇంటర్‌లో ప్రవేశాలు పెరిగాయన్నారు.
గతప్రభుత్వంలో విసీల నియామకంలో అనేక అక్రమాలు జరిగాయని, వైసిపికి అనుకూలంగా ఉన్న వారిని నియమించారని తెలిపారు. తాము విసిల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించామని తెలిపారు స్వాంతంత్య్ర సమరయోధుల గురించి విద్యార్థులకు తెలియజేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్‌ ను నియంత్రణకు యుద్ధం ప్రకటించామని డ్రగ్స్‌ వద్దు బ్రో క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నామని ప్రతి విద్యా సంస్థలో ఈగల్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత ఇంటర్‌ విద్యలో సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న 3,282 పోస్టులు భర్తీ చేస్తామని, అడ్మినిస్ట్రేషన్‌ కోసం యూనిఫైడ్‌ యాక్ట్‌ తీసుకువస్తామని, డీప్‌ టెక్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని భావిస్తున్నామన్నారు. లా, స్పోర్ట్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీల విషయంలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. లైబ్రరీలను బలోపేతం చేస్తామన్నారు.

➡️