- ఉపాధ్యాయ దినోత్సవం సంధర్భంగా చంద్రబాబు, పవన్ శుభాకాంక్షలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గురువులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం ఎక్స్ లో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులను గౌరవించుకుంటే మన సంస్కృతిని మనం గౌరవించుకోవడమేనని తెలిపారు. సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర అనిర్వచనీయమైందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో దేశానికి జ్ఞాన సంపన్నులైన, అంకితభావం కలిగిన యువతను అందించేందుకు ఉపాధ్యాయులు తపిస్తారని తెలిపారు. బోధన వృత్తిలో ఉన్నవారికి బోధనేతర బాధ్యతల భారం లేకుండా కూటమి ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో ప్రకటనలో విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి దిక్సూచిగా ఉపాధ్యాయులు నిలుస్తారని పేర్కొన్నారు.
‘సర్వేపల్లి’కి నివాళలర్పించిన జగన్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళలర్పించారు. ఆయన నివాసంలో పార్టీ నేతలు వైఎస్ అవినాష్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, సురేష్‌బాబు, చక్రవర్తిలతో కలిసి గురువారం నిర్వహించారు.
టిడిపి కార్యాలయంలో
రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం టిడిపి కార్యాలయంలో గురువారం జరిగింది. రాధాకృష్ణన్ చిత్రపటానికి ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు ఏవీ రమణ, పర్చూరి కృష్ణ, హాజీ హసన్ బాష, బుచ్చిరాంప్రసాద్, దారపనేని నరేంద్రబాబు, చెన్నుపాటి గాంధీ, రాజశేఖర్, శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కార్యాలయంలో
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాధాకృష్ణన్, ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు.