నేడు టీచర్స్‌ ఎంఎల్‌సి ఉప ఎన్నికల కౌంటింగ్‌

Dec 9,2024 01:47 #By election, #counting, #Teachers MLC

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఉప ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. కాకినాడలోని జెఎన్‌టియుకె ఆవరణలో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 16,737 మంది ఓటర్లకుగానూ 15,502 (92.62 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిటర్నింగ్‌ అధికారి, కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి ఆధ్వర్యంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది రౌండ్లలో లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 140 మంది సిబ్బందిని కేటాయించారు. ఓట్ల లెక్కింపునకు ఏడు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రౌండ్‌ ఫలితం మధ్యాహ్నం రెండు గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. పిడిఎఫ్‌ అభ్యర్థి బొర్ర గోపిమూర్తి, రిటైర్డ్‌ అధ్యాపకులు గంధం నారాయణరావు మధ్య ప్రధానంగా పోటీ ఉంది.

➡️