రాజధానిలో నిర్మాణాలపై టెక్నికల్‌ కమిటీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో నిలిచిపోయిన పనులను పరిశీలించి, చేయాల్సిన పనులపై సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక రంగ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పట్టణాభివృద్దిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరు ఇన్‌ ఛీప్‌ ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్‌అండ్‌బి, విఎంసి, ఎపిసిపిడిసిఎల్‌, ఎపిసిఆర్‌డిఏ, ఎడిసిఎల్‌ చీఫ్‌ ఇంజనీర్లు సభ్యులుగా ఉండనున్నారు. వీరితోపాటు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుండి ఒకరిని సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపె ఈ కమిటీ సమగ్ర రిపోర్టు తయారు చేయనుంది. ప్రస్తుతం ఉన్న భవనాల నిర్మాణస్థితి గతులు ఎలా ఉన్నాయనే అంశాన్ని వీరు పరిశోధిస్తారు. 2019 తరువాత నిచిలిపోయిన నిర్మాణాల పటిష్టతను ఈ కమిటీ అంచనా వేయనుంది. దీనికోసం ఈ పనిలో అనుభవం ఉన్న సంస్థలనూ వినియోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రోడ్లు, మంచినీటి పైపులైన్లు, సీవరేజీ, పవర్‌, ఐసిటితోపాటు చేపట్టిన పనుల పటిష్టతనూ, నాణ్యతనూ ఈ కమిటీ అంచనా వేయనుంది. నిర్మాణ ప్రాంతాల్లో మిగిలిపోయిన పైపులు, సీట్లు, ఇతర మెటీరియల్‌ ఉపయోగపడుతుందా లేదా ? అనే అంశాలనూ కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. పనులు చేపట్టడానికి అవసరమైన విధానాలనూ ఈ కమిటీ సూచించనుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే ఎలా చేస్తే ఉపయోగపడుతుందనేదీ ఈ కమిటీ పరిశీలించి నెలరోజుల్లో నివేదిక ఇవ్వనుంది. అలాగే పనులకు సంబంధించి కాంట్రాక్టు ఏజెన్సీలు చేసుకునే క్లెయిములపైనా నివేదిక తయారు చేయాలనీ ఉత్తర్వులలో సూచించారు.

➡️