- ‘ఉక్కు’ ఉద్యోగులను తొలగించక తప్పదు
- నిధులు వెచ్చించే స్థితిలో కేంద్రం లేదు
- కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేసేందుకు సాంకేతిక సమస్యలున్నాయని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్యాకేజీలతో తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారానికి పనిచేస్తున్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి అసాధ్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించక తప్పదని ఆయన తేల్చి చెప్పారు. విలీనానికి సంబంధించిన సాంకేతిక సమస్యల అంశంపై సెయిల్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. సెయిల్, ఎన్‌ఎండిసి అధికారులతో తాను సమావేశమయ్యాయని తెలిపారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు చెందిన 1,500 ఎకరాల భూమిని ఎన్‌ఎండిసికి బదలాయించి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రధానంగా చర్చించామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, ఉత్పత్తి తక్కువగా ఉందన్నారు. కాగా వైసిపి అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. తిరుమల విషయంలో అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకుంటుందని, లడ్డు వివాదంపై ఇప్పటికే కేంద్రం వివరాలను ఆరా తీసిందన్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా సీరియస్‌గా ఉందన్నారు.