తెలంగాణ : రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు, కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
‘ మీ ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నా ‘ అని తమిళిసై అన్నారు. ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళుతోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని కోరుతున్నానన్నారు. రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆశించారు. మార్పు కోసం తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటోందన్నారు. నిర్బంధపు పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకున్నారని అన్నారు. పౌరహక్కులు, ప్రజా హక్కులకు నాంది పడిందన్నారు. పాలకులు, ప్రజలకు మధ్య ఇనుప కంచెలు తొలగాయన్నారు. పాలకులు.. ప్రజా సేవకులే తప్ప పెత్తందార్లు కాదు అని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడిందన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగాలని కోరారు. ” ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో… ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..!” అని దాశరథి కవి రచించిన గేయాన్ని చదివారు. తెలంగాణ ఏర్పాటు చేసిన సోనియా, మన్మోహన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణ లోపాలపై విచారణ జరిపిస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరతామన్నారు. 6 నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తమిళి సై ప్రకటించారు.