- వైసిపి అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసిపిపై నిందలు మోపడం తప్ప వారిచ్చిన హామీలు ఏమి నెరవేర్చారో చెప్పడం లేదని మాజీ సిఎం, వైసిపి అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలోని వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌లోనూ, గవర్నర్ ప్రసంగంలోనూ పరనింద, ఆత్మస్తుతి మాత్రమే సాగిందన్నారు. సూపర్‌సిక్స్‌తో పాటు మ్యానిఫెస్టోలో 143 హామీల గురించి అడిగితే సమాధానం రాదని, అబద్ధం, మోసం తప్ప చంద్రబాబుకు మరొకటి తెలియదని చెప్పారు. తొమ్మిది నెలల పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్ల గవర్నర్‌తోనూ చెప్పించారని అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎగ్గొట్టడం కోసమే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. వైసిపి హయాంలో 6.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్లో 32,79,970 ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. 18 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయస్సున్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నా ఇవ్వలేదని తెలిపారు. వారిచ్చిన హామీని నెరవేర్చాలంటే రూ.32,400 కోట్లు కావాలని, బడ్జెట్లో రూపాయి కేటాయించలేదన్నారు. ఉచిత బస్సు పథకానికి రూ.3500 కోట్లు అవుతుందని, దానికీ నిధులు లేవని పేర్కొన్నారు. సూపర్‌సిక్స్ పథకాల అమలుకు రూ.79,867 కోట్లు కావాలని, బడ్జెట్లో కేటాయించింది రూ.17,179 కోట్లు మాత్రమేనని చెప్పారు ఉద్యోగులకు ఇచ్చే డిఏ పెండింగ్ ఉన్నా ఇవ్వడం లేదని అన్నారు. పైగా ఉద్యోగుల జీతాల వ్యయం తగ్గించారని అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో వైసిపి వారికి ఏపథకాలు ఇవ్వొద్దని చంద్రబాబు చెప్పారని, రాజ్యాంగానికి లోబడి ప్రమాణం చేసి ఇప్పుడు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం చంద్రబాబుకే చెల్లిందని ఆయన అన్నారు. శ్రీకాకుళంలో టీచర్లు గట్టిగా బుద్ది చెప్పారని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాకు సీట్ల సంఖ్యకూ సంబంధం లేదని, అయినా ప్రభుత్వం మొండివాదన చేస్తోందని అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ కార్పొరేట్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువని ఒక ప్రశ్నకు జవాబుగా జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.