- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- జిజియులో 2వ ప్రపంచ తెలుగు మహాసభ ప్రారంభం
ప్రజాశక్తి – రాజానగరం (తూర్పు గోదావరి జిల్లా) : తల్లి లాంటి తెలుగు భాషను కాపాడుకోవాలని, తెలుగు భాషా వికాసం ఉద్యమంగా సాగాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జిజియు) ప్రాంగణంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న 2వ ప్రపంచ తెలుగు మహాసభ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. జిజియు ఛాన్సలర్ కెవివి.సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలుగు భాషను, సంస్కృతిని ఆంగ్లేయులు చెడగొట్టారన్నారని, వాటిని సరిదిద్దుకోవాలన్నారు. ఆదికవి నన్నయ, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం వంటి వారు తెలుగు భాషను సుసంపన్నం చేశారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తెలుగును నేర్చుకుంటుంటే ఆంధ్రాలో ఉంటూ మనం ఎందుకు తెలుగు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సినీ రచయితలు ఆంగ్ల పదాలను వీలైనంత మేరకు లేకుండా చూసుకోవాలని సూచించారు. తెలుగును ప్రేమించు, ప్రోత్సహించు, కాపాడు అని పిలుపునిచ్చారు.
అనంతరం మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ.. ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు విధిగా తెలుగు మాధ్యమమే ఉండాలన్నారు. డిగ్రీ వరకు తెలుగు పాఠ్యాంశంగా ఉండాలని కోరారు. రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి తనను కోరారని, అప్పుడు ఇదే విషయం చెప్పానన్నారు. ఈ రెండు పనులు జరగనప్పుడు భాషా సంఘం ఉన్నా ప్రయోజనం లేదని, ఈ రెండు అమలైతే భాషా సంఘంతో పనే లేదన్నారు. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగు లేశంగా ఉందని పేర్కొన్నారు. భాష కోసం ఉద్యమించే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్యాంశాల్లో దోషాలు సరిచేయాలని కోరారు. డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మధ్య ఈ తెలుగు మహాసభను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త, పి.బంగారయ్య శర్మ, ప్రొఫెసర్ చామర్తి కెటి రామరాజు, మాజీ ఎమ్మెల్సీలు గొనె ప్రకాశరావు, రవివర్మ, శతావధాని కడిమెళ్ల వరప్రసాద్, న్యూక్లియర్ శాస్త్రవేత్త ఆర్.శ్యామసుందర్, సాహితీవేత్త ఎర్రాప్రగఢ రామకృష్ణ, డాక్టర్ వేదుల శిరీష, జిజియు విసి ఉదయగిరి చంద్రశేఖర్, జిజియు ప్రో ఛాన్సలర్ కె.శశికిరణ్‌వర్మ పాల్గొన్నారు.