రోడ్లు రక్తసిక్తం

  • వేర్వేరు ప్రమాదాల్లో పది మంది మృతి

ప్రజాశక్తి- యంత్రాంగం రోడ్డు రక్తసిక్తం అయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి, సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రానికి చెందిన పది మంది మృతి చెందారు. వీరిలో బాపట్ల జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు, అన్నమయ్య జిల్లాకు చెరదిన ముగ్గురు, కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన 25 మంది వ్యవసాయ కార్మికులు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పంక్చర్‌ కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు వేగంగా ఢకొీట్టింది. ఆ తర్వాత ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బాపట్లకు జిల్లా నక్కబొక్కలపాడుకు చెందిన లారీ డ్రైవరు దాసరి శివప్రసాద్‌ (43), ఆయన సోదరుడు దాసరి కిశోర్‌ (37), లారీ క్లీనర్‌ బండి నాగయ్య (27), స్థానికుడు మలికి లోవరాజు (30) అక్కడికక్కడే మృతి చెందారు.

అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని పట్టు పరిశ్రమ పరిశోధన కేంద్రం వద్ద లారీని మోటర్‌ బైక్‌ ఢకొీనడంతో ఒకే కుటుంబానికి చెందిన గంగాభవాని (32), కృష్ణబాబు (22), వినీత (4) మృతి చెందారు. వీరంతా సరస్వతిపల్లి గ్రామానికి చెందిన వారు.

కర్ణాటక రాష్ట్రంలోని దావణగేరి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి టెంపో వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ముగ్గురు మిరప రైతులు మృతి చెందారు. వారిలో కర్నూలు జిల్లా నాగలాపురం గ్రామానికి చెందిన మస్తాన్‌ (50), పెద్ద యంకన్న (45), మంత్రాలయం మండలం సింగరాజనహళ్లి గ్రామానికి చెందిన ఈరన్న (35) ఉన్నారు. మిరప పంటను కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

25 మంది వ్యవసాయ కార్మికులకు గాయాలువ్యవసాయ కార్మికులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని గుంతకల్లు రోడ్డులో చాకలి వంక వద్ద బోల్తా పడింది. బొలెరో ముందు టైరు పగిలిపోవడంలో జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వజ్రకరూరు ఎస్‌సి కాలనీకి చెందిన వీరంతా మిరప పంట కోత కోసం వెళ్తున్నారు.

మెరుగైన వైద్యం అందించాలి : వి.శ్రీనివాసరావు

ప్రమాదంలో గాయపడి అనంతపురం సర్వజన ఆసుత్రిలో చికిత్స పొందుతున్న వ్యవసాయ కార్మికులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు పరామర్శించారు. వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. పరామర్శించిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జిల్లా నాయకులు ఓ.నల్లప్ప ఎం.బాలరంగయ్య, ఆర్‌వి.నాయుడు, రామిరెడ్డి, ప్రకాష్‌, వలీ బాబు, సురేష్‌, జీవ, రాజు ఉన్నారు.

➡️