పదివేల కోట్ల విద్యుత్ భారాన్ని తిరస్కరించాలి

  • సర్దుబాటు చార్జీల భారం మోపే ప్రతిపాదనలపై సిపిఎం నేత సిహెచ్ బాబురావు

ప్రజాశక్తి-విజయవాడ : పదివేల కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపే ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కోరారు. సిపిఎం నేతలతో కలిసి బాబురావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని కస్తూరిబాయిపేట, గిరిపురం , సీతారాంపురం, అరండల్ పేట, గుణదల, కాలువ కట్టలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను అభినందించారు.  ఈ సందర్భంగా కార్మిక పురంలోని, గవర్నర్ పేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బాబురావు మాట్లాడుతూ…. ”గత ఐదు సంవత్సరాల కాలంలో వేలాది కోట్ల రూపాయలు పలురూపాలలో విద్యుత్ బారాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరో 10 వేల కోట్ల రూపాయల సర్దుబాటు చార్జీలను వడ్డించే ప్రతిపాదనలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపడం శోచనీయం.  2023 -24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతినెల 40 పైసలు చొప్పున యూనిట్ కు సర్దుబాటు చార్జీలు వసూలు చేశారు.  2014 సంవత్సరం నుండి వినియోగించిన విద్యుత్ పై మూడు రూపాలలో సర్దుబాటు చార్జీలు పేరుతో వేలాది కోట్ల రూపాయల భారం వేశారు.  స్వల్పకాలిక  విద్యుత్ కొనుగోళ్ళు పేరుతో అడ్డగోలుగా అవినీతి పాల్పడి పెద్ద ఎత్తున ప్రైవేటు కంపెనీ నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేశారు. మెటీరియల్ రేట్లు పెంచి దోచుకున్నారు, బొగ్గు మొదలు ట్రాన్స్ఫార్మర్ల వరకు అన్నిటిలోనూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. పిపీఏల పేరుతో బడా కంపెనీలకు కోట్లాది రూపాయలు కట్టబెట్టారు. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ అవినీతికి బాధ్యత వహించాలి. అవినీతి, అసమర్ధత, దుబారా ఖర్చులు పెంచి వాటిని సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్ పేరుతో ప్రజలపై మోపడం దారుణం. ఈ ప్రతిపాదనల వలన ప్రతి యూనిట్ కు అదనంగా రూ. 2.40 పై భారం పడుతుందని వార్తలు వస్తున్నాయి.  విద్యుత్ నియంత్రణ మండలి ఈ అడ్డగోలు ప్రతిపాదనలను తిరస్కరించాలి. అదనంగా అయిన ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. విద్యుత్ వినియోగించుకున్న తర్వాత సర్దుబాటు ట్రూ అప్ చార్జీల పేరుతో భారం వేసే విధానాలకు తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నెలనెలా భారం మోపే నిబంధనలు రూపొందించింది. విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టపెట్టే ప్రైవేటీకరణకు కేంద్రం ఆదేశాలు ఇస్తున్నది. వైసిపి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ కేంద్రం ఆదేశాలకు లొంగిపోయి ప్రజలపై భారాలకు మోపుతోంది. ప్రైవేటీకరణ ,సర్దుబాటు చార్జీల విషయంలో బిజెపి, వైసిపి, తెలుగుదేశం అందరిదీ ఒకటే దారి. ఈ విధానాలను ఎదుర్కోవాలి, విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి. ప్రైవేటీకరణ దోపిడీని అరికట్టాలి. ప్రజలపై భారాలు ఆపాలి. మళ్లీ పదివేల కోట్ల రూపాయల భారం మోపితే ఆందోళన తప్పదు, ప్రతిఘటన తప్పదు. సిపిఎం ప్రజలకు అండగా నిలుస్తుంది. ఈ భారాలను తిప్పికొడుతుంది. ఈ విధానాలను ఎదుర్కొంటుందని” అన్నారు. నేడు జరిగిన పర్యటనలో సిపిఎం నేతలు బి.రమణరావు, వై.సుబ్బారావు, లక్ష్మణ, గురుమూర్తి, బెనర్జీ, షకీలా, గోవిందు, కోరట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️