ప్రజాశక్తి-పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి పుంగనూరుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకున్నారు. ఇరు వర్గాలు రాళ్లు దాడులు చేసుకున్నారు. టమోటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఏడు కార్లు ధ్వంసం చేశారు. పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేయుటలో విఫలమయ్యారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా ఉన్నది.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిదున్ రెడ్డిపై దాడి అత్యంత హేయం
తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిదున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీ మిదున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్దంగ ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని అన్నారు.