తాడిపత్రిలో ఉద్రిక్తత

  • పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన టిడిపి శ్రేణులు
  • వైసిపి నాయకుడి ఇంటికి నిప్పు, వాహనాలు ధ్వంసం

ప్రజాశక్తి – తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. ఆయన అనుచరుడి ఇంటికి నిప్పంటించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు.
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మంగళవారం తాడిపత్రికి వస్తున్న నేపథ్యంలో కొండాపురం వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తమ ఇంటి వద్ద పని ముగించుకుని తిరిగి వెళ్తానని పోలీసులకు సర్ధిచెప్పి ఆయన తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్న టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పట్టణంలో గుమిగుడాయి.
తాడిపత్రిలోకి రాకుండా ఆయనను అడ్డుకునే ప్రయత్నంలో పెద్దారెడ్డి అనుచరుడు కందిగోపుల మురళి ఇంటిపై టిడిపి శ్రేణులు దాడి చేశాయి. ఆయన వాహనాలకు, ఇంటికి నిప్పు పెట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. వైసిపి కార్యకర్త రఫీపై దాడికి పాల్పడ్డారు. పెద్దారెడ్డి ఇంట్లో ఉన్నారన్న సమాచారంతో ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. టిడిపి శ్రేణులను అక్కడి నుంచి చెదరగొట్టారు. అతి కష్టం మీద పెద్దారెడ్డిని తిరిగి అనంతపురానికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌పి జగదీష్‌ తాడిపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం పెద్దారెడ్డి, జెసి ప్రభాకర్‌ అనుచరులు పట్టణంలో బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయనను అనంతపురానికి తరలించారు.

➡️