- అడ్డుకునే ప్రయత్నంలో భూమన, శిరీష అరెస్టు
ప్రజాశక్తి – తిరుపతి టౌన్ : డిప్యూటీ మేయర్ పదవికి వైసిపి తరపున పోటీలో ఉన్న శేఖర్‌రెడ్డి తిరుపతి డిబిఆర్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు కూలదోసేందుకు శనివారం సిద్ధమయ్యారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మేయర్ శిరీష, డిప్యూటీ మాజీ మేయర్ భూమన అభినరురెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణాన్ని కార్పొరేషన్ అధికారులు కూల్చే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది వైసిపి కార్యకర్తలను అరెస్టు చేసి ఎస్‌వి క్యాంపస్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తరువాత మేయర్ శిరీష, అభినరురెడ్డిని అరెస్టు చేసి పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరదీస్తోందని ఎంపి గురుమూర్తి విమర్శించారు. శేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న భవనానికి ఎటువంటి అనుమతులు లేవని డిప్యూటీ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ మహాపాత్ర తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనం 22ఎ పరిధిలో ఉందని, అందులో కొంత భూమి టిటిడికి సంబంధించినదని తెలిపారు.