టెన్త్‌ ప్రశాంతం

Mar 18,2025 00:10 #10th exams, #AP
  • నంద్యాలలో మారిన తెలుగు ప్రశ్నాపత్రం
  • ఇన్విజిలేటర్‌ను రిలీవ్‌ చేసిన డిఇఒ
  • చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌కు షోకాజు నోటీసులు

ప్రజాశక్తి- యంత్రాంగం : పదో తరగతి పరీక్షల్లో తొలి రోజే అపశృతులు చోటుచేసుకున్నాయి. నంద్యాల ప్రభుత్వ బాలికల పాఠశాల పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థినికి తెలుగు 70 మార్కుల ప్రశ్నాపత్రం 01టి బదులుగా వంద మార్కుల 03టి ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్‌ కామేశ్వరి ఇచ్చారు. పరీక్ష అయిన తర్వాత విద్యార్థులు సమాధాన పత్రాలు ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్‌ గమనించి పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాయంత్రం డిఇఒ కార్యాలయంలో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో డిఇఒ జనార్థన్‌రెడ్డి బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ కమిషనరేట్‌ డైరెక్టర్‌కు ప్రశ్నపత్రం మారిన విషయం తెలిపారు. వివరాలు పంపాలని, విద్యార్థినికి న్యాయం చేస్తామని డైరెక్టర్‌ హామీ ఇచ్చారు. ఇన్విజిలేటర్‌ కు షోకాజు నోటీసు ఇచ్చి విధుల నుండి డిఇఒ తప్పించారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ మార్గెట్‌, చీఫ్‌ డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ నరసింహులకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.

కర్నూలులో మాస్‌ కాపీయింగ్‌, ఇద్దరు విద్యార్థులు డిబార్‌ : ఒక టీచర్‌ సస్పెన్షన్‌, మరొకరికి షోకాజు నోటీసు

కర్నూలు జిల్లా జొన్నగిరి ఉన్నత పాఠశాలలోనూ, కర్నూలు నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి స్మారక మున్సిపల్‌ పాఠశాలలోనూ మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను అధికారులు డిమాండ్‌ చేశారు. ఆ పరీక్షా కేంద్రాల ఇద్దరు ఇన్విజిలేటర్ల (టీచర్ల)ను సస్పెండ్‌ చేశారు. వారిలో ఒకరికి షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేశారు.

నేలపై కూర్చొని పరీక్షలు

హోళగుంద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కింద కూర్చొని పరీక్ష రాస్తుండడాన్ని గమనించి ఆ పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లను విధుల నుంచి తప్పిస్తూ, వారిద్దరినీ ఆర్‌జెడికి డిఇఒ సరెండర్‌ చేశారు.

టెక్కలిలో గందరగోళం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఉన్నత, బాలికోన్నత పాఠశాలల వద్ద విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. సాధారణ పదో తరగతి పరీక్షలు, ఓపెన్‌ పదో తరగతి ఒకే కేంద్రాల్లో నిర్వహించడంతో హాజరైన విద్యార్థులు అయోమయ పరిస్థితికి గురయ్యారు. సాధారణ పదో తరగతి పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు ఓపెన్‌ పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి తమ హాల్‌ టికెట్ల నంబరు చూసుకున్నారు. అందులో నంబర్లు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. పరీక్షా కేంద్రాల నిర్వాహకులు వారికి స్పష్టతనివ్వడంతో కేంద్రానికి చేరుకున్నారు.

పరీక్ష రాయాలంటే…. నది దాటాల్సిందే!

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో పరీక్ష రాసేందుకు నాగావళి నది అవతల కొట్టు గ్రామానికి చెందిన విద్యార్థులు నదిని దాటుకొని వచ్చారు. విజయనగరం జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో వేసవి నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.

టెన్త్‌ పరీక్షా కేంద్రానికి తాత్కాలిక మార్గం

కృష్ణా జిల్లా కంకిపాడు-రొయ్యూరు రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతుండడంతో కొత్తగా వేసిన సిసి రోడ్డుపై వాహనాలు నడవకుండా ముళ్ల కంచె వేశారు. దీంతో, ఈ మార్గంలోని కంకిపాడు మండలం గొడవర్రు జడ్‌పి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి విద్యార్థుల కోసం తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారు.

98.27 శాతం మంది విద్యార్థులు హాజరు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షకు తొలిరోజు సోమవారం ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు 98.27 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ విజరురామరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో 6,27,277 మంది విద్యార్థులకుగానూ 6,16,451 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 10,826 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

➡️