తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బిఆర్‌ఎస్ పార్టీ బహిష్కరించింది. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై సిఎం సమాధానం ఇస్తుండగా బిఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని వాకౌట్‌కు ముందు ప్రకటించారు. బిఆర్‌ఎస్ పార్టీ స్ట్రెచర్ మీది నుంచి మార్చురీకే అని వ్యాఖ్యానించడం, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, 10 ఏండ్లు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన పాలనాదక్షుడు అయిన కేసీఆర్ చావును కోరుకోవడం అంటే.. తెలంగాణకు కీడును కోరుకోవడమే అని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తాము సిఎం ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా లాబీలో హరీష్ రావు మాట్లాడుతూ … పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని అన్నారు. అందుకే సీఎం స్పీచ్‌ను బహిష్కరించామని హరీష్ రావు తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీష్ రావు ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి.. 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారని తెలిపారు. ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ దే పాపం అని దుయ్యబట్టారు. రాహుల్ బజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారని ప్రశ్నించారు. పులిచింతల పోతిరెడ్డిపాడు కట్టినప్పుడు తాము కొట్లాడామని హరీష్ రావు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉండి.. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవి సాధించారని హరీష్ రావు విమర్శించారు. ఈ మధ్య ఉత్తమ్ కుమార్ దంపతులు చంద్రబాబును కలిసి భోజనం చేసి వచ్చారు.. ఆ తర్వాత శ్రీశైలం ఖాళీ చేసే లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని ఆరోపించారు. మాది త్యాగ చరిత్ర అయితే.. ఉత్తమ్ కుమార్‌ది ద్రోహ చరిత్ర అని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం వల్లనే ఈ రోజు పంటలు ఎండుతున్నాయని హరీష్ రావు దుమ్మెత్తిపోశారు.
