ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పిఆర్‌సి గురించి ప్రస్తావన లేదని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి అన్నారు. శాసనమండలిలో రాష్ట్రబడ్జెట్ పై జరిగిన చర్చలో బుధవారం ఆయన మాట్లాడుతూ 2023 జులై 1 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ పిఆర్‌సి అమలు చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఆశించారని తెలిపారు. తొమ్మిది నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు 12వ పిఆర్‌సి, ఐఆర్ ప్రకటించలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న డిఎలను గురించి ప్రస్తావన లేదన్నారు. సిపిఎస్‌కు మెరుగైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పారని ఇప్పటివరకు దీనిపై చర్చించలేదన్నారు. 2004కు ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలని కోరారు. మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌లో ఆర్ట్,క్రాఫ్ట్ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 5వేల ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పాఠశాల విద్యకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, మరలా అదే విధానాలను కొనసాగిస్తోందన్నారు. దీనివల్ల వేలాది ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, పార్ట్ టైం ఉద్యోగుల వేతనాలు పెంచాలని కోరారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేందుకు గత ప్రభుత్వం జివో 114ను తీసుకొచ్చిందని, దీనిని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాలలతో పాటు డిగ్రీ కళాశాలల్లో కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని కోరారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చిన రుణం అప్పా? సహాయామా? అని ప్రశ్నించారు. అప్పు అయితే కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా? అనే స్పష్టత ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కౌలు రైతులకు ఆర్ధిక సహాయంపై స్పష్టత లేదన్నారు. ప్రైవేట్ విద్య సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు. బడ్జెట్ అప్పుల దిశగా వెళ్తునట్లు ఉందని వైసిపి సభ్యులు టి మాధవరావు విమర్శించారు. బడ్జెట్‌లో ఆర్ధిక లోటు రూ.66వేల కోట్లు వరకు ఉందని చెప్పారు. ఇలానే అప్పులు చేస్తే 2029 నాటికి అప్పుల వల్లే రూ.1లక్ష కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో ఉన్న సినిమా రంగాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు.
దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని సూచించారు. పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్రప్రభుత్వంతో చర్చలు జరపాలని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామ్యంగా ఉందని, కాబట్టి హోదా అంశాన్ని పున:పరిశీలించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన ఎస్సి,ఎస్టి, బిసి, మైనార్టీ వారికి పింఛన్ సౌకర్యం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని రామసుబ్బారెడ్డి చెప్పారు. బడ్జెట్‌లో అందుకు తగ్గట్టుగా కేటాయింపులు లేవన్నారు. జనసేన సభ్యుల పి హరిప్రసాద్ విజనరీ బడ్జెట్‌గా అభివర్ణించారు. రాష్ట్ర ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రెక్కలు తోడిగిందన్నారు. టిడిపి సభ్యులు వేపాడ చిరంజీవి రావు గత ప్రభుత్వంలో తలసరి ఆదాయం తగ్గిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆదాయం పెరిగిందని చెప్పారు.
