శైలజ మృతదేహానికి పోస్టుమార్టం
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :దళిత బాలిక శైలజా కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామస్తులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు మంగళవారం గుంటూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ ముందు ధర్నా నిర్వహించారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని, బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో, ఆందోళన విరమించారు. ధర్నాలో రాష్ట్ర రజక జన సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్త రెడ్డిపాలెంలో పెరుపోగు శైలజను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన నాగరాజును కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 7వ తరగతి చదువుతున్న బాలికపై ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం దారుణమన్నారు. రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయని, ఎస్‌సి, ఎస్‌సి, బిసి మైనార్టీలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయకులు కూచిపూడి సత్యం మాదిగ మాట్లాడుతూ శైలజ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నాయీబ్రాహ్మణ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు తదితరులు పాల్గన్నారు.
శైలజ కుటుంబసభ్యులకు సిపిఎం పరామర్శ
శైలజ కుటుంబ సభ్యులను మార్చురీ వద్ద సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, పలువురు సిపిఎం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ శైలజను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సిపిఎం జిల్లా నాయకులు ఈమని అప్పారావు, దండా లక్ష్మీనారాయణ, వై.కృష్ణకాంత్, కిరణ్ తదితరులు ఉన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిరసన ర్యాలీ
నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కొత్తరెడ్డిపాలెం నుంచి చేబ్రోలు రోడ్డు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ముఖ్యంగా చిన్నారులు, బాలికలు, విద్యార్థినులు అత్యాచారాలు, హత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
పోస్టుమార్టం నివేదిక ప్రకారం చర్యలు : డిఎస్‌పి
బాలిక మృతదేహానికి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం పోస్టుమార్టం జరిగింది. వైద్యుల నివేదిక ప్రకారం తదిపరి చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి రమేష్ తెలిపారు.
