ఉన్నత విద్యకు చిరునామా ఎఎన్‌యు ‘దూరవిద్య’ కేంద్రం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. కుటుంబ పోషణలో భాగంగా నేరుగా వెళ్లి చదువుకోలేని పరిస్థితి నేటి యువతకు ఎదురవుతోంది. చదవాలనే ఆపేక్ష, ఉన్నత విద్యావంతులవ్వాలనే కోరిక తీర్చుకోవడం గతంలో గగనమయ్యేది. కానీ నేడు అది చేతికందేంత దూరంలోనే ఉంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ నుండి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వరకూ అన్ని డిగ్రీలూ ఇస్తూ విద్యాధికులను చేయడమే ధ్యేయంగా ఆచార్య నాగార్జునా యూనివర్శిటీ దూరవిద్యా కేంద్రం(ఎఎన్‌యు-సిడిఇ) సేవలందిస్తోంది. వేలమంది విద్యార్థులు ఇక్కడ నుండి పట్టాలు పొంది జీవితంలో స్థిరపడ్డారు. ఉద్యోగులు ఉన్నతస్థానాలను పొందారు. ఆచార్య నాగార్జునా యూనివర్శిటీ దూరవిద్యా కేంద్రం ఎంతోమందికి జీవితాన్ని, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు పొందడంలో కీలకపాత్ర పోషించింది. అత్యంత నైపుణ్యమైన సిబ్బంది సహకారంలోనూ, విద్యార్థులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడంలోనూ ఎంతో ప్రేమగా వ్యవహరించే ఈ కేంద్రం ఇప్పుడు రాష్ట్రంలోనే ఎంతో పేరుపొందింది. ఈ కేంద్రంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు మొత్తం 27 అందిస్తున్నారు. వీటిల్లో యుజి కోర్సులు 13, పిజి కోర్సులు 14 ఉన్నాయి. ఇవి కాకుండా రెండు డిప్లొమా కోర్సులు, రెండు సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉంచారు. వీటికి అత్యధిక డిమాండు ఉంది. ఆచార్య నాగార్జునా యూనివర్శిటీకి ఇప్పటికే నాక్‌ గుర్తింపు ఉంది. దూరవిద్యా కేంద్రానికి అదే వర్తిస్తుంది. 1967లో ఆంధ్రా యూనివర్శిటీ పిజి సెంటర్‌గా ఏర్పాటైన ఇది 1976లో పూర్తిస్థాయి యూనివర్శిటీగా ఏర్పాటైంది. ఇప్పుడు ఏకంగా దూరవిద్య ద్వారా వేలమందికి డిగ్రీలు ఇస్తోంది. అంతేకారు ఎక్కడికక్కడ లెర్నింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఎవరూ నేరుగా విశ్వవిద్యాలయానికి రాకుండా ఎక్కడికక్కడ సలహాలు పొందేలా అన్నిచోట్లా సెంటర్లను పెట్టింది. పుస్తకాలను వాటిద్వారానే అందజేస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే అవసరమనుకున్న వారికి ఇంటివద్దకే డిగ్రీని అందించే విధంగా ఎవరికీ ఇబ్బంది లేని విధంగా దూర విద్యా కేంద్రం నడుస్తోంది. వీటి ద్వారా డిగ్రీలు పొందిన వారు యుపిఎస్‌సి, ఎపిపిఎస్‌సి నిర్వహించే పరీక్షలకు అర్హులు. కొన్ని యూనివర్శిటీలు ఇచ్చే దూరవిద్య డిగ్రీలకు కొన్ని పరీక్షల్లో అర్హత ఉండదని, నాగార్జునా యూనివర్శిటీ పాటిస్తున్న విలువలకు ఇక్కడ ఇచ్చే డిగ్రీకి అంతే విలువ ఉంటుందని డైరెక్టర్‌ బట్టు నాగరాజు తెలిపారు. 2003లో ఏర్పాటు చేసిన ఈ దూరవిద్యా కేంద్రం ద్వారా బిఏ, బిబిఏ, బి.కాం(జనరల్‌), బికాం(కంప్యూటర్‌ అప్లికేషన్‌), బిఎల్‌ఐఎస్‌సి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏహిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్‌, ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఏంఏ సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యు, ఎంఏ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఎంఏ హెచ్‌ఆర్‌ఎం, ఎంకాం, ఎంఎల్‌ఐఎస్‌సి కోర్సులు అందిస్తున్నారు. వీటితోపాటు సర్టిఫికెట్‌ కోర్సులుగా హెచ్‌ఐవి ఎయిడ్స్‌ కౌన్సిలింగ్‌, హోటల్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, డిప్లోమా కింద సైకలాజికల్‌ గైడెన్స్‌ అండ్‌ కౌన్సిలింగ్‌, ఫుడ్‌ ప్రొడక్షన్‌ కోర్సులు అందుబాటులో ఉంచారు. మొత్తం 31 ప్రొగ్రామ్స్‌ను దూరవిద్య అందిస్తోంది. దీనికి యుజిసి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో నుండి దీనికి గుర్తింపు ఉంది. అలాగే దేశంలోనే ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ సెంటర్లలో ఒకటిగా పేరుగాంచింది. డిఫెన్స్‌ సిబ్బంది, వికలాంగులకు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఫీజు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.

  • విద్యాధిక సమాజం కోసమే కృషి

ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ప్రతిరోజూ వేర్వేరు ఉపాధి మార్గాలు వెతుక్కుంటూ చదువుకోవాలనే ఆసక్తి, కోరికను ఆచార్యా నాగార్జున యూనివర్శిటీ దూరవిద్యా కేంద్రం నెరవేరుస్తోంది. ఇది తాము చేస్తున్న పనికి, బాధ్యతలకు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తోంది. దీనికి వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య పి.రాజశేఖర్‌ ప్రోత్సాహం ఎంతో ఉంది. అంటే తామేదో చేస్తున్నామని కాదు, ఎంతోమంది విద్యాధికులను చేయడం యూనివర్శిటీలో ఒక ముఖ్యమైన విధిగా భావిస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, వేర్వేరు ఫ్రొఫెషనల్‌ రంగాల్లో ఉన్న వారు కూడా అదనపు అర్హతల కోసం విద్యను అభ్యసిస్తున్నారు. అనుకోని సంఘటనతో జైళ్లకు వెళ్లినవారిలోనూ కొంతమందికి ఇక్కడ నుండి విద్యా ప్రదానం చేశాం. అలాగే సమాజంలో హేళనకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లకూ డిగ్రీలు ఇచ్చేందుకు మేము అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం.

– ఆచార్య బట్టు నాగరాజు, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్‌

➡️