వక్ఫ్‌ చట్ట సవరణ రాజ్యాంగ వ్యతిరేకం

  • మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

ప్రజాశక్తి – కడప : వక్ఫ్‌ చట్ట సవరణ రాజ్యాంగ వ్యతిరేకమని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కడపలోని తన నివాసంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 13, 14, 15, 21, 25, 26, 29, 30 300-ఎ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైసిపి తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని, ఇందుకు సంబంధించి ఈ నెల 16న కోర్టులో హియరింగ్‌కు వస్తుందని తెలిపారు. మొదటి నుంచి ఈ బిల్లుకు వైసిపి వ్యతిరేకమని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసిపి ఎంపిలకు విప్‌ కూడా జారీ చేశారని వివరించారు. వైసిపిపై టిడిపి దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా దుష్ప్రచారం మానుకోవాలని హితవుపలికారు. సమావేశంలో కార్పొరేటర్‌ షఫీ, వైసిపి మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️