ప్రజాశక్తి- ఏలూరు అర్బన్ : కోకో గింజల కొనుగోలు, ధర సమస్యపై కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ మేరకు ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం కోసం ఎదురు చూస్తామన్నారు. కోకో రైతులకు న్యాయం చేయకపోతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏలూరులోని అన్నే భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడారు. నెల రోజులుగా కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం హర్షణీయమన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో జరిగిన జాయింట్ సమావేశంలో కంపెనీల ప్రతినిధులు అబద్దాలు చెప్పడం విమర్శించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు రూ.750కుపైగా ధర ఉందని, కంపెనీలు రూ.550 నుండి రూ.450కే కొనుగోలు చేస్తుండడం, అన్ సీజన్ గింజలను కొనుగోలు చేయకపోవడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మంత్రి హామీ మేరకు ఈ నెల ఏడో తేదీ వరకు కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలపై సానుకూల నిర్ణయం కోసం ఎదురు చూస్తామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జిఒ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీల మోసాలు అరికట్టాలని కోరారు. కోకోను సాగు చేసి నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చే వరకు పోరాడుతామని తెలిపారు. కోకో రైతులందరూ సంఘటితం కావాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుతరామయ్య, గుదిబండి వీరారెడ్డి, రాష్ట్ర కోశాధికారి జాస్తి కాశీబాబు తదితరులు పాల్గొన్నారు.
