నెయ్యి వివాదంపై సిట్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు

తిరుపతి : తిరుమల వేంకటేశ్వరుడి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటన చేశారు. సిట్‌ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామన్నారు. అయితే ఆ దిశగా కసరత్తు చేపట్టారు. మరి సిట్‌ చీఫ్‌గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పేర్లు ప్రాధానంగా వినిపిస్తున్నాయి. వారిలో సీనియర్‌ ఐపీఎస్‌ పీహెచ్‌డీ రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠిలు ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని సిట్‌ చీఫ్‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరిద్దరితో పాటుగా వినీత్‌ బ్రిజ్‌లాల్‌, సీహెచ్‌ శ్రీకాంత్‌ పేర్లూ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ మహేష్‌చంద్ర లడ్డాలు అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం భేటీ అయ్యారు. ఐజీ, అంతకంటే పైస్థాయి అధికారిని సిట్‌ చీఫ్‌గా నియమిస్తామని చంద్రబాబు ప్రకటించగా.. ఆయా అధికారుల ప్రొఫైల్‌, ఇతర వివరాల్ని డీజీపీ, నిఘా ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ముఖ్యమంత్రికి సమర్పించారు. అలాగే ఈ సిట్‌లో సభ్యులుగా ఎవరెవర్ని తీసుకోవాలనే అంశంపైనా చర్చించారు.. నేడు అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది.

➡️