సాంస్కృతిక రంగంలో కమ్యూనిస్టుల కృషి పెరగాలి
ఎంఎ బేబి ఉద్ఘాటన
ప్రజాశక్తి- కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : హిట్లర్ తరహా జాతీయవాదాన్నే ఫాసిస్టు ఆరెస్సెస్ సాంస్కృతిక జాతీయవాదం ముసుగులో ముందుకుతెస్తోందని, దీనిని తిప్పికొట్టాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం ఎ బేబి పేర్కొన్నారు. సిపిఎం 27 వ రాష్ట్ర మహాసభ ముగింపు సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ, సాంప్రదాయకంగా సంస్కృతికి వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు. అయితే, ఆరెస్సెస్ సాంస్కృతిక రంగంలో తన ఫాసిస్టు ఎజెండాతో వేగంగా చొచ్చుకెళ్తోందని ఆయన చెప్పారు. సాంస్కృతిక జాతీయవాదం పేరుతో మతోన్మాద శక్తులు మత విశ్వాసాలను ఎలా దుర్వినియోగపరుస్తున్నదీ ఆయన వివరించారు. కేరళలో గ్రామీణ ప్రాంతాల్లో గోకులాలను ఏర్పాటు చేసి ఒక పథకం ప్రకారం పిల్లల మెదళ్లలోకి విషపూరిత భావజాలాన్ని చొప్పించేందుకు అది ఎలా కుట్రపూరితంగా యత్నిస్తున్నదీ తెలిపారు. దీనిని అడ్డుకునేందుకు బాలల సంఘాలను పెద్దయెత్తున ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆరెస్సెస్ ఫాసిస్టు సంస్కృతికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ సంస్కృతిని ముందుకు తేవాలని, ఈ విషయంలో బాలోత్సవాలు, విజ్ఞాన కేంద్రాల ద్వారా పార్టీ నిర్వహిస్తున్న కృషి బాగానే ఉందని, అయితే, ఇది చాలదని ఆయన చెప్పారు. ఆరెస్సెస్ ఫాసిస్టు సాంస్కృతిక జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు మెజార్టీ మతోన్మాద ప్రమాదాన్ని ఎండగట్టాలన్నారు. అదే సమయంలో మైనార్టీ మతోన్మాదాన్ని కూడా ఉపేక్షించకూడదన్నారు. మతానికి సంబంధించి బకునిన్‌కు , మత భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేటప్పుడు మతానికి సంబంధించిన మార్క్సిస్టు అవగాహనను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలన్నారు. సమాజంలో వస్తున్న మార్పులపై రాజకీయంగా, సైద్ధాంతికంగా, నిర్మాణ పరంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో విజ్ఞాన కేంద్రాలు, గ్రంథాలయాలు కీలక భూమిక వహించాలన్నారు. గ్రంథాలయాల ప్రాధాన్యతను గుర్తించిన పుచ్చల పల్లి సుందరయ్య విద్యార్థి దశలో ఉండగానే బాలగంగాధర్ తిలక్ పేరుతో సొంత లైబ్రరీని ఏర్పాటు చేసిన విషయాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బేబి గుర్తు చేశారు.
