డీలిమిటేషన్‌పైనే చర్చిస్తే బిజెపి ఉచ్చులో పడినట్టే

  • మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను విస్మరించి కేవలం డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన) చుట్టూ చర్చ జరిగితే బిజెపి ఉచ్చులో పడినట్లేనని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ అన్నారు. ‘నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) పూర్వాపరాలు – శాస్త్రీయ పద్ధతి’ అనే అంశంపై గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ఆధ్యర్యాన శ్రీకాకుళం నగరంలోని కేంద్ర గ్రంథాలయ సమావేశ మందిరంలో గురువారం సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన అంశం పార్లమెంట్‌లో సీట్ల సంఖ్యకు సంబంధించినది కాదని.. ప్రజాస్వామ్యం, ఫెడరిలిజం, సామాజిక న్యాయం, స్వావలంబన, లౌకికతత్వం వంటి మౌలిక సూత్రాలతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు. డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపడితే ఫెడరిలిజానికి ఎదురుకానున్న ప్రమాదాన్ని గుర్తించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అమెరికా చెప్పినట్లు వ్యవసాయం, వ్యవసాయోత్పత్తులకు సుంకాలను తగ్గిస్తే బిజెపి ప్రభుత్వానికి స్వావలంబన ఇంకేముందని ప్రశ్నించారు. రాష్ట్రాలు, వెనుకబడిన ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని బిజెపి ప్రభుత్వం ఎత్తేయడంతో రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగాయన్నారు. జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని తెలిపారు. 2021 నాటి జనాభా లెక్కలంటే బిజెపికి భయమని, ఆ లెక్కలు తీస్తే యూపి, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో జనాభాతోపాటు వృత్తి, ఆదాయం, సామాజిక, ఆర్థిక, జీవన పరిస్థితులు బయటపడతాయని, మోడీకి ఆ ధైర్యం లేదన్నారు. నియోజకవర్గాల సంఖ్య పెంచుకోవడానికి చంద్రబాబు పిల్లలను కనాలని చెప్తున్నారని, ఇది సాధ్యమయ్యే పనేనా? అని ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టమైన అభిప్రాయం చెప్పడానికీ జగన్‌కు ధైర్యం చాలడం లేదన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం జర్నలిజం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రెడ్డి తిరుపతిరావు మాట్లాడుతూ అసమానతలకు తావులేకుండా డీలిమిటేషన్‌ చేపట్టాల్సిన అవసరముందని తెలిపారు. ప్రముఖ న్యాయవాది పి.వి.ఎస్‌ సీతారామయ్య మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డీలిమిటేషన్‌ చేస్తామని బిజెపి ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం కోశాధికారి సుధాకరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️